రైతుల కోసం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలను… తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తోందని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఢంకా బజాయించి చెబుతున్నారు. అయితే వారివన్నీ ఉట్టి ప్రగల్భాలే అని.. వాస్తవం మాత్రం ఇంకోలా ఉందని రైతు రుణమాఫీ పథకం అమలు తీరుని చూస్తూనే అర్థం అవుతుంది. 2018 ఎన్నికల్లో గెలిచిన తెల్లారే రూ. లక్ష రుణమాఫీ చేస్తున్నట్లు హామీలు ఇచ్చారు. రైతులను నమ్మించి, మోసం చేసి గద్దెనెక్కారు. ఆ వెంటనే మాట మార్చి.. దఫాలుగా మాఫీ చేస్తమన్నారు. రుణమాఫీ అయితది, కొత్త రుణాలు తీసుకుని పంటలు పండించుకోవచ్చు అని ఆశగా ఎదురుచూసిన రైతుల నోట్లో మట్టికొట్టారు. కనీసం.. రెండో మాట ప్రకారమైనా, దఫ దఫాలుగా మాఫీ చేశారా అంటే.. అదీ లేదు. రెండోసారి అధికారం చేపట్టి 4 ఏళ్లు పూర్తయినా, ఇప్పటికీ సగానికిపైగా రైతుల తమ రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయా అని ఎదురు చూస్తున్నారు. ప్రశ్నించిన రైతులపైనే గులాబీ లీడర్లు తిరగబడుతున్నారు. ఏకంగా ఓ మంత్రి అయితే.. రుణమాఫీ గురించి అడిగితే జైలుకు పంపుతా అని బెదిరించాడంటే.. రాష్ట్రంలో ఎలాంటి నియంతృత్వ పోకడలు సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ వ్యాప్తంగా 40.66 లక్షల మంది రైతులకి రూ. లక్ష లోపు రుణాలు మాఫీ కావాల్సి ఉంది. ఇందుకుగాను తొలి మూడేండ్లలో రూ. 17 వేల కోట్లు కేటాయించిన కేసీఆర్ సర్కార్.. కేవలం రూ. 3 వేల కోట్లు మాత్రమే ఇచ్చింది. ఈ 3 వేల కోట్లలోను మొదటిసారి రూ. 400 కోట్లు, రెండోసారి రూ. 300 కోట్లు తిరిగి ప్రభుత్వ ఖజానాకే మళ్లాయి. దీంతో.. రూ. 25 వేల లోపు 2.96 లక్షల మంది రైతులకి… రూ. 50 వేల లోపు 4.50 లక్షల మందికి రైతులకు మాత్రమే ఇప్పటి వరకు రుణాలు మాఫీ అయ్యాయి. రూ. 50 వేల నుంచి రూ. లక్ష లోపు రుణాలు ఉన్న రైతులకు మాత్రం ఇంకా మోక్షం లభించడం లేదు. దీంతో.. బ్యాంకర్లు రైతుల ఖాతాల్లో సొమ్ముని జప్తు చేస్తున్నారు. పంటను అమ్మిన డబ్బులు పడితే, వాటిని కూడా బాకీల కిందకి మళ్లిస్తున్నారు. ఇదేం అన్యాయం అని బ్యాంకులని ప్రశ్నిస్తే… ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి, మీరే కట్టాలనే సమాధానం వస్తోందని రైతులు వాపోతున్నారు. మరోవైపు పాత రుణాలు మాఫీ కాక, కొత్త రుణాలు బ్యాంకర్లు ఇవ్వక, రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులని ఆశ్రయిస్తున్నారు. వారికి అధిక వడ్డీలు కట్టలేక, అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదేనా టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోన్న రైతు సంక్షేమం అంటే.. ?
పెట్టుబడికి పైసా పుట్టక కష్టాల్లో ఉన్న రైతులు, రుణమాఫీ ఏమైందని ప్రశ్నిస్తే, టీఆర్ఎస్ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. గతేడాది జూలైలో వరంగల్ జిల్లాలో జరిగిన పల్లె ప్రగతి సభలో కొంత మంది రైతులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని రుణమాఫీ గురించి ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన మంత్రి.. రుణమాఫీ గురించి అడిగితే జైలుకు పంపుతా అంటూ రైతులని బెదిరించారు. వందల మంది ముందు, సాక్షాత్తూ ఓ మంత్రే అలా మాట్లాడటం చూసి రైతులు నివ్వెరపోయారు. తాము ఏం తప్పు చేశామని జైలుకి పంపుతారని ప్రశ్నించారు. మచ్చుకు ఇదో ఉదాహరణ మాత్రమే. టీఆర్ఎస్ 8 ఏళ్ల పాలనలో రైతులపై జరిపిన దౌర్జన్యాలు అనేకం ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో రైతుల చేతికి సంకెళ్లు, వరి ధాన్యం రాసులపై గుండెపోటుతో రైతుల మరణాలు, సకాలంలో రుణమాఫీ కాక – అప్పు పుట్టక – చేసిన అప్పులు కట్టలేక రైతుల ఆత్మహత్యలు..! ఎకరానికి రూ. 5 వేల పెట్టుబడి సహాయంతో రైతుల కష్టాలన్నీ తీరతాయని చెబుతున్న ప్రభుత్వాల మాటల విశ్వసిస్తే… ఇదిగో ఇలాంటి ఘటనలు, నష్టాలు, అవమానాలే ఎదుర్కోవాల్సి వస్తుంది కదా మరి !!
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.