తన శిష్యుడు అవంతిపై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అయ్యాడా?.అసలు గంటా పూర్తిగా ఎంటర్ కాకముందే అవంతి అనుచరులు కలవర పడుతున్నారా?ఇక్కడ వరుస బెట్టి వైసిపి నేతలు టిడిపిలో ఎందుకు చేరుతున్నారు?
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఘటనా ఘటన సమర్ధుడు అని అంటారు. ఆయనకు ఓటమెరుగని నేత అని మరో పేరు ఉంది. ఆయనది పాతికళ్ళ రాజకీయం. ఇప్పటిదాకా గంటా అయిదు ఎన్నికలు చూసారు. కానీ ఏ ఒక్క ఎన్నికల్లోనూ ఓటమి పాలు కాలేదు. అసలు గంటా పొలిటికల్ టూర్ స్టైలే వేరుగా ఉంటుంది. ఆయన విశాఖ జిల్లాలో ఉన్న నాలుగు అసెంబ్లీ సీట్లలోనూ గెలుపొందారు. అందులోనూ పోటీ చేసిన సీట్లో మళ్లీ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.కానీ రాజకీయ జీవితంలో మొదటిసారి ఆయన పోటీ చేసిన సీటులో మళ్ళీ పోటీకి దిగుతున్నారు. అదే భీమునిపట్నం. అయితే పదేళ్ళ తరువాత ఆయన ఈ ప్రయోగం చేస్తున్నారు. 2014లో భీమిలీ నుంచి పోటీ చేసి గెలిచిన గంటా 2024లో మళ్లీ ఇదే సీటు ఎంచుకోవడం వెనక ఆయనకు ఉన్న సెంటిమెంట్లు ఎన్నో.
అలాగే భీమిలీ నుంచి గెలిస్తే ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆయన నమ్ముతున్నారు. అలా తాను మళ్ళీ మంత్రి కావాలని చూస్తున్నారు. ఇక గంటాను భీమిలీ అభ్యర్ధిగా టీడీపీ ప్రకటించిన మరుక్షణం భీమిలీలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. గంటా గురి పెట్టింది నేరుగా వైసీపీ మీదనే. తన శిష్యుడు అవంతి శ్రీనివాస్ వైసీపీ నుంచి అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. ఆయన బలాలు బలహీనతలు గంటాకు బాగా తెలుసు. దాంతో గంటా ఆపరేషన్ వైసీపీ అంటున్నారు. వైసీపీలో ఈ రోజుదాకా ఉన్న నాయకులను మొత్తానికి మొత్తం తన వైపునకు తిప్పుకునే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టేశారు. అలా బలమైన నేతలుగా ఉన్న భీమిలీ జెడ్పీటీసీ గాడు వెంకటప్పడుని టీడీపీ వైపు లాగేశారు. అలాగే సింగనబంద సర్పంచ్ గాడు వెంకట నారాయణను కూడా సైకిలెక్కించేశారు. ఇదే తీరులో భీమిలీ మండలంతో పాటు ఇతర మండలాల్లో కీలక వైసీపీ నేతలుగా ఉన్న వారి మీద ఆకర్షణ మంత్రాన్ని ప్రయోగిస్తున్నారు.
వారంతా గతంలో గంటా మంత్రిగా ఉన్నపుడు భీమిలీలో ఆయనతో పనిచేసిన వారే. గంటా వేరే నియోజకవర్గం చూసుకోవడంతో వారు అవంతి వైపు వచ్చి 2019లో పనిచేశారు. ఇపుడు వారు గంటాకు జై అంటున్నారు. తొందర్లో వైసీపీలో పెద్ద నాయకులు మరి కొందరు కూడా గంటా వైపు వస్తారని టాక్ ఉంది. పరిణామాలతో శిష్యుడు అవంతి విలవిలలాడుతున్నారన్నది నిజం.ఇక వైసీపీలో ఎంత ఏమరుపాటుగా ఉన్నారు అంటే తమ పక్కన ఉన్న వారు జెండాలు మార్చేసేవరకూ అసలు గుర్తించలేకపోవడం. ఆలస్యంగా విషయం తెలుసుకున్న అవంతి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. ఇదిలా ఉంటే అవంతి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నా తన సొంత సైన్యంతో వస్తున్నారు. తనదైన టీం తో బరిలోకి దిగుతున్నారు. ఆయన మార్క్ పాలిటిక్స్ ని స్టార్ట్ చేశారు.అంగబలం అర్ధబలం తో పాటు అన్ని విధాలుగా బిగ్ షాట్ అయిన గంటా ధాటికి నిలిచి వైసీపీ జెండా ఎగరవేస్తుందా అన్నదే ఇపుడు చర్చగా ఉంది.
గంటా శిష్యుడిగా ఆయన పట్లు కూడా అవంతికి తెలుసు. కానీ గంటా ఎత్తులకు పై ఎత్తులు వేగంగా వేయాలి. ఢీ అంటే ఢీ కొట్టాలి. అవంతికి గంటాకు మధ్య తేడా ఏమిటీ అంటే గంటా అందరికీ కలుపుకుని పోతారు. ఆయన ప్రత్యర్ధులను అయినా దగ్గరకు తీస్తారు అని అంటారు. గంటాలో ఆవేశం అయితే బయటకు ఎక్కడా కనిపించదు. కానీ అవంతిలో ఆవేశం జాస్తి అంటారు. ఆయనకు కోపమే చాలా సార్లు ఇబ్బంది తెచ్చింది కూడా.వ్యూహాలు రూపొందించడంలో గంటా బెటర్ అని అంటారు. మొత్తం మీద చూస్తే కనుక అవంతి తన గురువు మీదనే తలపడుతున్నారు. గంటా వేసిన ఎత్తులను తట్టుకుని ముందుకు సాగాలంటే ఆయన అభ్యర్ధిత్వం మీద అసంతృప్తిగా ఉన్న వారిని అవంతి ఆకట్టుకోవాలి, మరి ఆయన ఆ పని చేస్తేనే తప్ప గంటాను నిలువరించలేరు. ఇంకా భీమిలీ రాకుండానే గంటా ఆపరేషన్ స్టార్ట్ చేశారు అంటే రానున్నో రోజుల్లో ఆయన దూకుడు ఏ రేంజిలో ఉంటుందో చూడాలి మరి..