రాష్ట్రంలో సీఎంఆర్ ధాన్యం కుంభకోణం… టీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యుల పాత్ర… సీబీఐ విచారణకు డిమాండ్.
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్, ధాన్యాన్ని ఎఫ్ సీఐకి సరఫరా చేసే ప్రక్రియలో పెద్ద ఎత్తున అవక తవకలు జరుగుతున్నాయి.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ప్రతి ఏటా వందల కోట్ల రూపాయల మేర ధాన్యం కుంభకోణానికి పాల్పడుతున్నారు.
ఈ ఏడాది మార్చి 22 – 24 తేదీల మధ్య ఎఫ్ సీఐ అధికారులు క్షేత్ర స్థాయిలో భౌతిక తనిఖీలు చేపట్టి గుట్టురట్టు చేసిన విషయం మీకు కూడా తెలుసు.
2020 – 21 యాసంగి, 2021 – 22 వానాకాలం పంటకు సంబంధించిన ధాన్యం నిల్వల విషయంలో ఈ తనిఖీలు జరిపారు.
ఈ సందర్భంగా…కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కింద ప్రభుత్వం రైస్ మిల్లులకు కేటాయించిన నిల్వల్లో ఏకంగా 4,53,896 బస్తాల ధాన్యం భౌతికంగా లేకపోవడాన్ని ఎఫ్ సీఐ అధికారులు గుర్తించారు.
50 కేజీల బస్తా చొప్పున ఇది 2,26,948 క్వింటాళ్ల కింద లెక్క. దీని విలువ సుమారు రూ.45 కోట్ల మేరకు ఉంటుందని అధికారులు లెక్క తేల్చారు.
దీనిని బట్టి ప్రభుత్వం సీఎంఆర్ కింద రైస్ మిల్లులకు కేటాయిస్తున్న ధాన్యాన్ని వారు మిల్లు బట్టి బియ్యాన్ని ఎఫ్ సీఐకి సరఫరా చేయకుండా బహిరంగ మార్కెట్ లో అధిక ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లుల్లో 30 శాతం మేర అవకతవకలు జరుగుతున్నట్టు ఎఫ్ సీఐ అధికారులు గుర్తించారు.
అదే సమయంలో రేషన్ బియ్యాన్ని రూ.8 -10 చొప్పున కొనుగోలు చేసి, పాలిషింగ్ చేసి అదే బియ్యాన్ని సీఎంఆర్ కింద చూపి ఎఫ్ సీఐకి సరఫరా చేస్తున్నట్టు అధికారుల తనిఖీలలో తేలింది.
ఒప్పందం ప్రకారం 8.34 లక్షల మెట్రిక్ టన్నుల రబీ బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇంత వరకు ఇవ్వలేదని మీరు కూడా రెండు రోజుల క్రితం ఒక పత్రికా సమావేశంలో చెప్పారు.
పంట పండలేదా… లేక పండిన పంటను బ్లాక్ లో అమ్ముకుంటున్నారా… లేదా రైస్ మిల్లర్లు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారా? అని మీరే సందేహాలు వ్యక్తం చేస్తూ ప్రశ్నలు సంధించారు.
ఎఫ్ సీఐ అధికారుల తనిఖీలలో కుంభకోణం బట్టబయలైంది.
మీరు కూడా బియ్యం గాయబ్ అయ్యాయని చెబుతున్నారు. అంటే… రాష్ట్రంలో బియ్యం కుంభకోణం జరుగుతోందని మీకు తెలుసు.
ఎఫ్ సీఐ కి చేరాల్సిన బియ్యం బహిరంగ మార్కెట్ లో అమ్ముకుంటూ… రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి ఎఫ్ సీఐ కి సరఫరా చేస్తున్నట్టు నిర్ధారణ అయింది.
రాష్ట్ర వ్యాప్తంగా 3,200 కు పైగా రైస్ మిల్లులు ఉన్నాయి. ఇందులో 900 మిల్లుల్లో తనిఖీ చేస్తేనే రూ.400 కోట్ల కుంభకోణం బట్టబయలైంది.
ఇలా గడచిన ఎనిమిదేళ్లుగా టీఆర్ఎస్ నేతల అండదండలతో రైస్ మిల్లుల్లో రీ సైక్లింగ్ కుంభకోణం ఏ స్థాయిలో జరిగి ఉంటుందో… ఎన్ని వేల కోట్ల ప్రజాధనం లూటీ జరిగి ఉంటుందో అంచనా వేసుకోవచ్చు.
ఇంత స్పష్టంగా కుంభకోణం జరుగుతున్నట్టు ఆధారాలు కనిపిస్తుంటే కేంద్ర ప్రభుత్వంగా చర్యలు తీసుకునే అధికారం ఉండీ ఎందుకు మిన్నకుంటున్నారు!?
కేసీఆర్ తో రోజూ లడాయి పెట్టుకున్నట్టు ఫోజులు కొడుతున్న మీరు… టీఆర్ఎస్ ప్రభుత్వంలోని ముఖ్యుల ప్రమేయంతో జరుగుతోన్న ఈ కుంభకోణంపై ఎందుకు విచారణకు ఆదేశించ లేకపోతున్నారు?
ఎఫ్ సీఐ ని మోసం చేస్తూ… ప్రజాధనాన్ని లూటీ చేస్తోన్న మిల్లర్లపై చర్యలు తీసుకోకుండా మిమ్మల్ని అడ్డుకుంటోన్న ఆ ఆదృశ్య శక్తులు ఎవరు?
టీఆర్ఎస్ నేతల అండదండలతో దందా చేస్తోన్న మిల్లర్లపై మీరెందుకు సౌమ్యంగా ఉంటున్నారు?
డిమాండ్లు :
⦁ రాష్ట్రంలో సీఎంఆర్ పేరుతో రైస్ మిల్లుల్లో జరుగుతోన్న అవక తవకలు, బియ్యం రీ సైక్లింగ్ పై తక్షణం సీబీఐ విచారణ జరిపించాలి.
⦁ 2014 నుండి ఇప్పటి వరకు సీఎంఆర్ కేటాయింపులు, ఎఫ్ సీఐకి చేసిన సప్లై, గాయబ్ అయిన బియ్యం నిల్వలు… అన్నింటిపైనా విచారణ సమగ్రంగా జరగాలి.
⦁ బాధ్యులైన మిల్లులను సీజ్ చేసి… రెవెన్యూ రికవరీ యాక్టు కింద జరిగిన దోపిడీ సొమ్ము మొత్తాన్ని వసూలు చేయాలి.
⦁ రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి సూత్రధారులుగా ఉన్న టీఆర్ఎస్ ముఖ్యుల పై కూడా క్రిమినల్ చర్యులు తీసుకోవాలి.
⦁ టీఆర్ఎస్ పై ఉత్తుత్తి పోరాటాలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టడం కాదు. తక్షణం బియ్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి.