రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు ఖరారైంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో జరిగిన విపక్షాల భేటీలో యశ్వంత్ సిన్హా పేరును కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ యశ్వంత్ సిన్హా పేరును ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు యశ్వంత్ సిన్హా కూడా ఇప్పటికే సుముఖత వ్యక్తం చేశారు. జూన్ 27న ఉదయం 11.30గంటలకు రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మద్దతు తెలిపారని శరద్ పవార్ చెప్పారు. ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని అన్ని పార్టీలకు యశ్వంత్ సిన్హా విజ్ఞప్తి చేశారు.
సిన్హా రాజకీయ నేపథ్యమిది..
1984లో ఐఏఎస్‌కు రాజీనామా చేసిన యశ్వంత్ సిన్హా జనతా పార్టీలో చేరారు. 1988లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఎంపికయ్యారు. 1998, 1999, 2009లో ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2002లో వాజ్‌పేయీ మంత్రివర్గంలో కేంద్ర విదేశాంగశాఖ మంత్రిగా పనిచేశారు. చంద్రశేఖర్ కేబినెట్‌లో ఏడాది పాటు (1998) కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సిన్హా బీజేపీ నుంచి బయటకు వచ్చి గతేడాది తృణమూల్‌లో చేరారు.
తృణమాల్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఈ ఉదయం ఆ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ప్రధాని వాజ్‌పేయీకి సన్నిహితుడైన సిన్హాకు వివిధ పార్టీల నేతలతో సత్సంబంధాలున్నాయి. వాజ్‌పేయీ హయాంలో, మోదీ నేతృత్వంలో పాలన ఎలా మారిందో తేడా చెప్పే క్రమంలో సిన్హా పేరును విపక్షాలు వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకొచ్చాయి. జులై 18న రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ నిర్వహించనుండగా.. 21న ఓట్ల లెక్కింపు జరగనుంది.