తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు ఎన్నో ఉన్నా “జై భీమ్”మూవీ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. తన నటనతో లాయర్ పాత్రలో పూర్తిగా జీవించేశారు. విశేష ఆదరణ చూరగొన్న ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతోంది. మరోసారి లాయర్ పాత్రలో సూర్య నటించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇటీవల సినిమా దర్శకుడు, నిర్మాత వెల్లడించారు.
ఏడాది కిందట ఓటీటీల్లోకి వచ్చిన “జై భీమ్” కు సీక్వెల్ ను తెరకెక్కించనున్నారు. గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో జై భీమ్ మూవీ డైరక్టర్ జ్ఞానవేల్, నిర్మాత రాజశేఖర్ పాండియన్ పాల్గొన్నారు. ఆ వేడుకలో జై భీమ్ సినిమా సీక్వెల్ ప్రస్తావన రాగా.. అందుకు సమాధానమిస్తూ సీక్వెల్ తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. జై భీమ్ కు సీక్వెల్ ఉండనుందనే ప్రకటనతో సూర్య అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జై భీమ్ సినిమాలో సూర్య పోషించిన పాత్ర నిజ జీవితంలో జస్టిస్ చంద్రు కెరీర్ లో మైలురాయిగా నిలిచిన ఓ కేసు ఆధారంగా తెరకెక్కించారు. ఏ నేరం చేయకుండానే ప్రాణాలు కోల్పోయిన తన భర్త పరిస్థితి మరెవరికి రాకూడదని ఓ ఆదివాసీ మహిళా చేసిన పోరాటం ఈ సినిమా. ఆ మహిళాకు కావాల్సిన న్యాయాన్ని వకీల్ గా జస్టిస్ చంద్రు అందించటం కోసం ఎలా పోరాడారు అన్నది హైలెట్ చేస్తూ తెరకెక్కించిన చిత్రమిది.
ఈ సినిమాలో కొన్ని సీన్స్ కంటతడి పెట్టించాయి. కొన్ని సన్నివేశాలను ప్రేక్షకులకు కనెక్ట్ చేసి భావోద్వేగానికి గురయ్యేలా చేసిన సినిమా ఇది. ఓటీటీలో వచ్చిన ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. సీక్వెల్ లో ఎలాంటి ఎమోషన్స్ ను డైరక్టర్ చూపిస్తారన్నది ఉత్కంట రేకెత్తిస్తోంది.
Also Read : శృతి హసన్ కు ఏమైంది..? ఇలా మారిపోయింది..!