ఏపీలో అప్పుడే జనసేన ఎన్నికలకు రెడీ అవుతోంది. వైసీపీని గద్దె దించేందుకు పొత్తు తప్పనిసరి అనుకుంటే టీడీపీతో కలిసి వెళ్తామని జనసేనాని సంకేతాలు పంపుతున్నారు. దీంతో పవన్ పోటీపై అప్పుడే చర్చ మొదలైంది. గతంలో పోటీ చేసిన గాజువాక, భీమవరం నుంచే జనసేన అధినేత మరోసారి పోటీ చేస్తారా..? లేక ఇతర నియోజకవర్గాలు ఏమైనా పరిశీలనలో ఉన్నాయా..? అని రాజకీయ వర్గాలు ఆరా తీస్తున్నాయి.
2019లో పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేశారు. భీమవరం, గాజువాక నుంచి బరిలో నిలవగా ఆ రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. అయితే..వచ్చే ఎన్నికల్లో మాత్రం గతంలో పోటీ చేసిన ఈ రెండు నియోజకవర్గాలతోపాటు మరో మూడు నియోజకవర్గాలు జనసేన పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయం వరకు పవన్ పోటీ చేసే నియోజకవర్గాలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం లేదు. ఎందుకంటే జనసేన పరిశీలనలో ఉన్న మరో మూడు నియోజకవర్గాల వెనక అ పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడ ఉంది.
జనసేన పరిశీలనలో ఉన్న మూడు నియోజకవర్గాలు తిరుపతి, కాకినాడ రూరల్, పిఠాపురం. ఈ మూడు చోట్ల పవన్ పోటీని పరిశీలించడం వెనక కారణం ఉంది. కాపు సామజిక వర్గం ఓట్లు ఈ మూడు నియోజకవర్గంలో అధికంగా ఉన్నాయి. తిరుపతి నుంచి ప్రజారాజ్యం అద్యక్షుడుగా మెగాస్టార్ చిరంజీవి పోటీ చేసి అప్పట్లో విజయం సాధించారు. తిరుపతిలో కాపు సామజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. అందుకే జనసేన ఈ స్థానాన్ని పరిశీలిస్తోంది.
పిఠాపురం నియోజకవర్గంలో 75శాతం ఓట్లు కాపు సామజిక వర్గం ఓట్లే. అందుకే అక్కడి నుంచి పవన్ పోటీ చేస్తే విజయం నల్లేరు మీద నడకే అవుతుందని జనసేన నేతలు భావిస్తున్నారు. పిఠాపురం జనసేనానికి ఫేవర్ గా ఉందని జనసేన నేతలు పార్టీ దృష్టికి తీసుకెళ్తున్నారు.
కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి కురసాల కన్నబాబు గతంలో ప్రజారాజ్యం నుంచి గెలిచారు. ఆ తరువాత వైసీపీలో చేరి వరుసగా విజయం సాధిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో లక్ష ఎనభై వేల ఓట్లు ఉంటె.. అందులో లక్ష ఓట్లు కాపు సామజిక వర్గం వారివే. అందుకే పవన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే విజయం ఖాయమని లెక్కలు వేసుకుంటున్నారు.
గాజువాక, భీమవరం నుంచి పోటీ చేయని పక్షంలో.. కాకినాడ రూరల్, పిఠాపురం, తిరుపతి నియోజకవర్గాలను జనసేనాని ఎంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.