ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ గతమైంది. ఇప్పుడు పేరు మార్చుకొని బీఆర్ఎస్ గా ఏర్పడింది. ప్రాంతీయభావంతో ఏర్పడిన పార్టీ ప్రజల్లో సెంటిమెంట్ ను ఆసరా చేసుకొని, భావోద్వేగాలను రెచ్చగొట్టి అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయింది. కేసీఆర్ సీఎం అయిపోయారు. ఎనిమిదేళ్ళు పరిపాలించారు. ఓ ప్రత్యేక సందర్భంలో అనూహ్యంగా వచ్చిన సీఎం పదవి బోర్ కొట్టేసిందేమో , ఇప్పుడు జాతీయ రాజకీయాలని పలవరిస్తున్నాడు. తనను రాజకీయంగా శిఖరానికి చేర్చిన తెలంగాణను వదిలేసి దేశ రాజకీయాలంటూ ప్రయాణం ప్రారంభించాడు. అయితే ఇక్కడ టీఆర్ఎస్ పేరును మార్చి కేసీఆర్ తన పునాదుల్ని ఆయనే పెకిలించుకున్నట్టు అర్థం అవుతోంది.
ఉద్యమ నాయకుడని నమ్మి కేసీఆర్ ను సీఎంను చేసింది తెలంగాణ. ప్రజల్లో అమూర్తభావంగా నిలిచిన ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ ను ఉద్యమంగా మలిచి..ఆ పోరాటానికి నాయకత్వం వహించడం వలన రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ బాహుబలిగా మారారు. అలా ఎదిగి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణను వదిలేయలనిపించడం విడ్డూరమే. కాని ఆయన మనస్సు ఎందుకో జాతీయ రాజకీయాల వైపు లాగుతోంది. అందుకే టీఆర్ఎస్ పేరు మార్చేశారు. కేసీఆర్
రాజకీయ ఎదుగుదలకు పునాదిగా నిలిచిన తెలంగాణను వీడటమంటే ఆయన తన పునాదులను ధ్వంసం చేసుకున్నట్లే లెక్క.
Also Read : ఒడిసిన టీఆర్ఎస్ కథ..!
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.కేసీఆర్ ను తెలంగాణకు చెందిన వ్యక్తిగా అసలే అంగీకరించని రేవంత్… ఈ విషయంలో బీఆర్ఎస్ ఆవిర్భావంతో తమకు అనుమాలు తీరిపోయాయన్నారు. ఎందుకంటే కేసీఆర్ మూలాలు బీహార్ లో ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ మార్పుతో తెలంగాణతో కేసీఆర్ కున్న కాస్త బంధం కూడా తెగిపోయిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
తెలంగాణ వస్తుందని ఎవరూ అనుకోలేదు. కాని నేనే సాధించానని చెప్పే కేసీఆర్.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాననే అత్యాశ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకోవచ్చు. కాని ప్రతిసారి రాజకీయాల్లో అద్భుతాలు జరగవు. తెలంగాణ ఆకాంక్షను ఉద్యమంగా మలిచేందుకు చాలా కాలమే పట్టింది. అదే సెంటిమెంట్ తెలంగాణలో కేసీఆర్ రారాజుగా చేసింది కాని, ఎలాంటి సెంటిమెంట్ లేకుండా దేశ ప్రజలని కేసీఆర్ తనవైపు తిప్పుకుంటాడా..? ఇది అత్యాశే కదూ.!