తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో పార్టీని వీడిన నేతలను తిరిగి టీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు స్వయంగా కేసీఆర్ , కేటీఆర్ రంగంలోకి దిగారు. పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో కలిసి సాగుదామంటూ తండ్రి, కొడుకులు ఆహ్వానాలు పలుకుతున్నారు.
బీజేపీలో కొనసాగుతూ అసంతృప్త నేతలుగా ముద్రపడిన కీలక నేతలతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. జితేందర్ రెడ్డి , రఘునందన్ రావు, వివేక్ వెంకట స్వామితోపాటు ఏనుగు రవీందర్ రెడ్డి, విఠల్ తోనూ కేసీఆర్ , కేటీఆర్ లు మంతనాలు జరిపినట్లు సమాచారం. ఇప్పటికే దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్ తో చర్చలు ఫలించగా… రెట్టించిన ఉత్సాహంతో టీఆర్ఎస్ అధిష్టానం ఆపరేషన్ ఆకర్ష్ కు మరింత పదును పెట్టింది. బీజేపీ కీలక నేతలు జితేందర్ రెడ్డి, రఘునందన్ రావు, వివేక్ లకు కేసీఆర్ కీలక హామీ ఇచ్చారని.. దాంతో వారంతా తిరిగి టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమయ్యారని ప్రచారం జరుగుతోంది.
దుబ్బాక , హుజురాబాద్ లో ఉప ఎన్నికల బీజేపీ ఇంచార్జ్ గా పని చేసిన జితేందర్ రెడ్డి కమలం క్యాంప్ లో గోల్డెన్ లెగ్ అయిపోయారు. ఆయన ఫోకస్ చేసిన రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినా జితేందర్ రెడ్డికి రావాల్సిన గుర్తింపు రాలేదని అసంతృప్తితో ఉన్నారు. వివేక్ కూడా బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ వర్గపోరుతో సతమతం అవుతున్నారు. ఇక, రఘునందన్ రావు బీజేపీఎల్పీ నేత పదవి ఆశించారు కాని , రాజాసింగ్ ను తప్పించి రఘునందన్ కు ఇచ్చేందుకు రాష్ట్ర నాయకత్వం మోకలాడ్డుతోంది. దీంతో బీజేపీలో అసంతృప్త నేతలను గుర్తించిన కేసీఆర్ వారందరికీ ఫోన్లు చేసి టీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానం పలకడంతో వారంతా బీజేపీని వీడెందుకు రెడీ అయ్యారని సమాచారం. ఉద్యోగ సంఘాల నేత విఠల్, ఈటలకు అత్యంత సన్నిహితుడు ఏనుగు రవీందర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం.
శుక్రవారం సాయంత్రం జితేందర్ రెడ్డి ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ తో భేటీ అవుతారని తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారని తెలుస్తోంది. పార్టీలో చేరేందుకు అంగీకరించిన నేతలంతా కలిసి మునుగోడులో ఏర్పాటు చేయనున్న సభలో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది.