వారికి పెళ్లయి నెల రోజులే అయింది.
ఆ విధంగా చూసుకుంటే ఇంకా కొత్త జంటే. ఒకరి కోసం మరొకరు పరితపిస్తూ.. గడిపే ప్రతి క్షణాన్ని మధురానుభూతులతో నింపుకోవాల్సిన సమయం. కానీ ఏమైందో తెలియదు. ఇద్దరి మధ్య సఖ్యత కొరవడింది. వారి మధ్య తలెత్తిన వివాదాలు.. నెల రోజుల్లోనే తారాస్థాయికి చేరాయి. అంతే విచక్షణ లోపించి భర్తపైనే దాడి చేసే స్థితికి చేరింది ఆ భార్య. బ్లేడుతో భర్త గొంతు కోసింది. హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండలో ఈ దారుణం చోటుచేసుకుంది.
పసరగొండకు చెందిన రాజ, అర్చన దంపతులు. వారికి నెల క్రితమే బంధుమిత్రులు, కుటుంబీకుల సమక్షంలో వివాహం జరిగింది. అన్యోన్య దంపతుల్లా ఉంటారనుకునే వీరి మధ్య నెల రోజుల్లోనే మనస్పర్థలు తలెత్తాయి. ఉదయం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో.. రాజుపై అర్చన దాడికి పాల్పడింది. అక్కడే ఉన్న బ్లేడుతో అమానుషంగా గొంతు కోసి చంపేందుకు యత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే రాజును వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. రాజ, అర్చనలకు మధ్య అసలు గొడవేంటి.? అర్చనను రాజు మానసికంగా లేదా శారీరకంగా ఏమైనా వేధిస్తున్నాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అర్చనను అదుపులోకి తీసుకున్నారు.
భర్తలపై దాడులు: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భర్తలపై జరుగుతున్న పలు అరాచకాలు కలవరపెడుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో పడిన కొందరు మహిళలు.. పవిత్రమైన దాంపత్య బంధాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. సుపారీలు ఇచ్చి మరీ ప్రియుడి సహాయంతో భర్తను చంపిస్తున్నారు. ఫలితంగా జైలుపాలై కడుపున పుట్టిన పిల్లలను అనాథలను చేస్తున్నారు. వనపర్తలో మూడు నెలల క్రితం అదృశ్యమైన ఓ వ్యక్తి కేసు.. శ్మశానవాటికలో శవమై తేలింది. భర్త స్నేహితుడి మోజులో పడిన భార్య.. సుపారీ ఇచ్చి మరీ భర్తను చంపించింది. పోలీసులు విచారణ చేయగా ఇటీవల విషయం వెలుగులోకి వచ్చింది.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.