తెలంగాణ రైతులు సర్కార్ ఇచ్చే పంట పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగి పంట సాగు చేసి నెల రోజులు అవుతున్నా, రైతు బంధు నిధులు ఇంకా విడుదల చేయలేదు. పంట పెట్టుబడి కోసం రైతు బంధు డబ్బులు అక్కరకు వస్తాయని రైతులు వెయిట్ చేస్తుంటే.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడంపై పెదవి విరుస్తున్నారు.
రైతు బంధు నిధుల విడుదలపై వ్యవసాయ శాఖతోపాటు ఆర్ధిక శాఖలో ఎలాంటి కదలిక కనిపించడం లేదు. దీంతో రైతు బంధు నిధులు ఎప్పుడు ఇస్తారన్న దానిపై స్పష్టత కొరవడింది. ఈ నెల ఆఖర్లో ఇస్తారని కొందరు, కాదు వచ్చే నెలలో ఇస్తారని మరికొందరు చెప్తున్నారు. ఏదీ ఏమైనా, కేసీఆర్ ఆమోదం తరువాతే రైతు బంధు నిధుల విడుదలపై క్లారిటీ రానుంది.
అక్టోబర్ నుంచి యాసంగి పంట సాగు ప్రారంభమైంది. సర్కార్ ఇచ్చే రైతు బంధు వస్తుందని ధీమాతో రైతులు అప్పులు చేసి మరీ పంటలను సాగు చేశారు. కాని, ఇప్పటివరకు రైతు బంధు నిధులు విడుదల అవ్వకపోవడంతో రైతుల్లో ఓ రకమైన నిర్వేదం కనిపిస్తోంది. అంతేకాదు, కూలీలకు చెల్లించే ఖర్చులు కూడా రైతులకు భారంగా మారాయి. ఈ పరిస్థితుల్లో సర్కార్ సాయం అందితే తమకు ఆసరా ఉంటుందనుకుంటే ఇంకా రైతు బంధు నిధులు విడుదల చేయడం లేదని చర్చించుకుంటున్నారు.