కామారెడ్డిలో కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కలసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన సీనియర్ నేత షబ్బీర్ అలీ ఒంటెద్దు పోకడ.. శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా కీలక నేతలుగా ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని కార్యకర్తలు బహిరంగానే మాట్లాడుకుంటున్నారు. ఇందుకు చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయని చెప్పుకుంటున్నారు. టీపీసీసీ ఐటీ సెల్ ఛైర్మన్ మదన్ మోహన్ నిర్వహించిన జాబ్ మేళా వైపు షబ్బీర్ అలీ కన్నెత్తి చూడకపోవడం ఇందుకు నిదర్శనం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేంటి… సొంత పార్టీ, సొంత నియోజకవర్గానికి చెందిన రాష్ట్రస్థాయి కీలకనేత నిర్వహించిన ప్రోగ్రామ్ కు వస్తే… పార్టీకి మంచి జరుగుతుండే కదా..! అని పార్టీ నేతలు అక్కడ ఇక్కడ అంటున్నారు.
అసలు సంగతేంటంటే… మదన్ మోహన్ లోక్ సభ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, దేశంలోనే అతితక్కువగా ఒకశాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు. టీఆర్ఎస్ కు 42శాతం, కాంగ్రెస్ కు 41శాతం ఓట్లు పోలయ్యాయి. జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనే కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో షబ్బీర్ అలీ కామారెడ్డిలో ఓడిపోయినప్పటికీ… లోక్ సభ ఎన్నికల్లో కామారెడ్డిలో కాంగ్రెస్ కు మెజారిటీ ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ కు కామారెడ్డిలో బలముందనే విషయం స్పష్టమైంది. కానీ… గడచిన 7 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 5సార్లు ఎందుకు ఓడిపోయిందనే కోణంలో పార్టీ నాయకత్వం ఆలోచనలో పడింది. పార్టీకి బలమున్నా.. షబ్బీర్ అలీ అభ్యర్థిత్వమే మైనస్ అవుతోందనే నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.
కామారెడ్డిలో వరుస ఓటముల నుంచి తేరుకోవడానికి కాంగ్రెస్ అధినాయకత్వం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తవారిని రంగంలోకి దింపనున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలా చేస్తే పార్టీ గెలుపు ఖాయమనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఇక కొత్త వారు ఎవరంటే.. ఆ రేసులో అజారుద్దీన్, మదన్ మోహన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరిలో ఎవరో ఇంకా తేలనప్పటికీ.. షబ్బీర్ అలీ పేరును దాదాపు పక్కన పెట్టినట్టేనని పార్టీలో బహిరంగానే చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయకపోవడం, యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో కుమారుడిని కూడా గెలిపించుకోలేకపోవడం ఆయన వైఫల్యాల జాబితాలో చేరిపోయాయి. కుమారుడి ఓటమికి కూడా షబ్బీర్ అలీ, ఆయన అనుచరుల ఒంటెద్దు పోకడనే కారణమని తెలుస్తోంది.
కామారెడ్డి జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న షబ్బీర్ అలీకి పార్టీ రెండుసార్లు మంత్రిగా అవకాశం కల్పించింది. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి, మండలిలో ప్రతిపక్షనేత హోదాను కట్టబెట్టింది. ఇంతటి ఆదరణ కల్పించిన పార్టీని గెలిపించేందుకు షబ్బీర్ అలీ నష్ట నివారణ చర్యలు చేపట్టకపోగా పార్టీకి మరింత నష్టం చేకూర్చే ధోరణి అనుసరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఎదుగుతున్న నేతలు ఏదైనా కార్యక్రమం చేపడితే పాల్గొనకపోవడం కూడా ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. కామారెడ్డిలో ఏప్రిల్ 3న మదన్ మోహన్ తన ట్రస్ట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. నిరుద్యోగ యువతకు ఎంతో మేలు చేకూర్చే కార్యక్రమం. ఉద్యోగాలు కల్పించాలంటూ ప్రభుత్వంపై కాంగ్రెస్ పోరాడుతున్న తరుణంలో పార్టీకి కలిసివచ్చే అంశం.
మదన్ మోహన్ నిర్వహించిన జాబ్ మేళాకు పెద్దఎత్తున స్పందన వచ్చింది. నిరుద్యోగ యువత హాజరై… ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమం చేపట్టడం.. తమలాంటి గ్రామీణ పేదలకు ఎంతో మేలు కలిగించినట్టేనని కృతజ్ఞతలు తెలిపారు. మరి ఇలాంటి కార్యక్రమానికి… షబ్బీర్ అలీ ఎందుకు హాజరు కానట్టు…? జాబ్ మేళాకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటూ షబ్బీర్ అనుచరులు పదేపదే చేసిన ఎందుకు వ్యాఖ్యానిస్తున్నట్టు….? షబ్బీర్ అలీ, ఆయన అనుచరుల వైఖరిపైనా కార్యకర్తల్లోనే కాదు.. ప్రజల్లోనూ చర్చ మొదలైంది. కాంగ్రెస్ నాయకుడు చేపట్టిన కార్యక్రమంతో పార్టీకి మేలు జరిగే అవకాశం ఉన్నప్పుడు… పార్టీకి సంబంధమే లేదని అనడంలో ఆంతర్యమేంటనే సందేహాలు తలెత్తుతున్నాయి.
కామారెడ్డిలో ఏం జరుగుతోంది…..?
.Also Read: బిఎస్పి నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు అవమానం..?