తెలంగాణ తల్లి కష్టజీవి. ఊరి సంస్కృతికి ప్రతిరూపం. మన తల్లి దొరల గడీలలో దొరసాని కాదు… ఒంటి నిండా వజ్రవైడుర్యాలు పొదిగిన నగలు, నెత్తిన బంగారు కిరీటాన్ని ధరించి రాచరికానికి ప్రతిరూపంగా రాజదర్పాన్ని కలిగి ఉండటం మన తల్లి లక్షణం కానే కాదు. పెత్తందార్ల పై తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ, రజాకార్ల పై తుపాకీ ఎక్కుపెట్టిన మల్లు స్వరాజ్యం తెలంగాణ సంస్కృతికి నిదర్శనాలు.
సకల జన తెలంగాణకు, సబ్బండ వర్గాల జనులకు తమ తల్లిని స్ఫురించే రూపం తెలంగాణ తల్లి స్థానానికి అర్హురాలవుతుంది తప్ప… దొరల గడీలలోని దొరసాని రూపమో, రాచరికపు లక్షణాలు కలిగి ఉన్న మహారాణి రూపంమో మన తల్లి కాదు… కాబోదు. అందుకే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్సే తెలంగాణ సబ్బండ వర్గాల ఆమోదయోగ్యమైన “తెలంగాణ తల్లి” ని కూడా ఆవిష్కరిస్తోంది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాన్ని తిరిగి పున:ప్రతిష్ఠించబోతోంది. మన రాష్ట్రం, మన తల్లి, మన గేయం, మనగానం, మనజెండా, మన ఎజెండా, మన రాష్ట్ర ఆంగ్ల సంక్షిప్త రూపం… ఇలా సర్వం సకలజన ఆమోదయోగ్యంగా… నిజమైన తెలంగాణ సాంస్కృతికి వారసత్వాన్ని పున:ప్రతిష్ఠకు సంకల్పం తీసుకుంది. తెలంగాణ సాయుధ పోరాటానికి 75 సంవత్సరాలు పూర్తవుతోన్న సందర్భంలో ప్రతి పల్లె, ప్రతి పట్నం, ప్రతి తండా, ప్రతి గూడెం… ఊరు వాడ ఏడాది పాటు మన వారసత్వ ఘనతను చాటుదాం.