అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న కాంగ్రెస్ లోకి రానున్న రోజుల్లో నేతల చేరికలు ముమ్మరం కానున్నాయా..? రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంగా టీఆర్ఎస్ , బీజేపీలకు చెందిన అసమ్మత్తి నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారా..? టీఆర్ఎస్ – బీజేపీలు ఒకటేననే విషయం కల్వకుంట్ల కుటుంబ అవినీతికి వ్యతిరేకంగా కత్తులు దూస్తోన్న నేతలు గ్రహిస్తున్నారా..? ఈ పరిణామం కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు దోహదం చేయనుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఏఐసీసీ అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ప్రకటన బీజేపీ , టీఆర్ఎస్ నాయకత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ రెండు పార్టీల నుంచి కీలక నేతలు తమతో టచ్ లో ఉన్నారని.. వారంతా త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతారనే ప్రకటనతో ప్రత్యర్ధి పార్టీల నేతలు అలర్ట్ అయ్యారు. ఎవరెవరు పక్కచూపులు చూస్తున్నారని బండి సంజయ్ ఆరా తీస్తున్నారు. ఇక, టీఆర్ఎస్ అధినేత మాత్రం ఎమ్మెల్యేలు చేజారకుండా చర్యలు చేపట్టాలని మంత్రులు కేటీఆర్ , హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు. రాహుల్ పాదయాత్ర ముగిసే వరకు నేతలు చేజారకుండా కాపాడుకోవాలని.. ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఆ ప్రభావం తీవ్రంగా ఉండనుందని కేటీఆర్ ను హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.
దక్షిణ తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎంపీ తమతో టచ్ లో ఉన్నారని మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. ఐతే , పార్టీ మారేందుకు నిర్ణయించుకొని , కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఎవరెవరని కేటీఆర్ ఆరా తీస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ఎమ్మెల్సి తోపాటు , ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు కాంగ్రెస్ లో చేరాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. తొలుత ఆయన బీజేపీలోకి వెళ్లాలని అనుకున్నా.. ఇటీవలి పరిమాణాలు టీఆర్ఎస్ , బీజేపీ ఒకటేనని గ్రహించి తన మూడ్ ను మార్చుకున్నట్లు ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు.