ఆరా సంస్థ విడుదల చేసిన సర్వే ఫలితాలు టీఆర్ఎ స్ లో కాక రేపుతున్నాయి. సర్వేలో టీఆర్ఎస్ దే అధికారమని తేల్చినా.. ఉమ్మడి ఏడు జిల్లాలో బీజేపీ కారుకు గట్టి పోటీనిస్తుందని పేర్కొనటం గులాబీ బాస్ కు అస్సలు మింగుడు పడటం లేదు. ఆరా సంస్థ చేసిన సర్వేకు విశ్వసనీయత లేదని కేసీఆర్ కు స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ… ఈ సర్వేలో టీఆర్ఎస్ కు బీజేపీ నుంచి ప్రమాదం పొంచి ఉందని వెల్లడించడం పట్ల ప్రగతి భవన్ లో కలకలం రేగినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలోనూ ఎక్ నాథ్ షిండేలు పుట్టుకొస్తారని బీజేపీ జాతీయ నాయకులు హెచ్చరికలు జారీ చేస్తోన్న సమయంలో… తాజా సర్వే ఫలితం ఎటు వైపు దారి తీస్తుందోనని కేసీఆర్ ఆందోళనగా తెలుస్తోంది. బీజేపీలో బూస్టింగ్ నింపిన ఆరా సర్వేతో ఆ పార్టీలోకి చేరికలు మరింత ముమ్మరం అవుతాయా అని టీర్ఎస్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. గతంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రితో పార్టీలో చేరాలని బీజేపీ అధినాయకత్వం సంప్రదింపులు జరిపిందనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో పరిస్థితి కమలానికి అంత అనుకూలంగా లేదని ఆ మంత్రి వెనక్కి తగ్గారనే చర్చ జరిగింది.
ఇటీవలి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణపై ఆ పార్టీ ఎంతగా ఫోకస్ చేసిందో ఆ మంత్రికి అర్దమైందట. అదే సమయంలో ప్రధాని సహా కేంద్రమంత్రులు మూకుమ్మడిగా టీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు గుప్పించిన తీరుతో ఆ మంత్రి తన మనస్సును మార్చుకున్నాడనే చర్చ జరుగుతోంది. ప్లాన్ లో భాగంగానే కాంగ్రెస్ లోకి వలసలు ఆగిపోయెందుకుగాను ఆరా సర్వేలో బీజేపీకి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అడ్వాంటేజ్ ఉందనే బూటకపు సర్వే ఫలితాన్ని విడుదల చేయించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ముందుగా కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడంలో భాగంగా ఎంచుకున్న ఎత్తుగడే ఆరా సర్వే ఫలితమనే రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఆ మంత్రే తెలంగాణ ఎక్ నాథ్ షిండే అవుతారా అన్నది వేచి చూడాలి.