చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా..? చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఈ వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలంటే రాజీనామాలే కరెక్ట్ అని ఆ పార్టీ లెజిస్లేచర్ విభాగం సమాలోచనలు జరుపుతుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై పార్టీ పరంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా లెజిస్లేచర్ పరంగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేస్తే ఎలా ఉంటుంది..? అనే అంశంపై సైకిల్ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచనలు చేస్తున్నారు.
టీడీపీకి ప్రస్తుతం 21మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ వీరంతా రాజీనామాలు చేస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచినట్లు అవుతుంది. చంద్రబాబును కక్షపూరితంగా అరెస్ట్ చేశారనే సందేశం జనాల్లోకి వెళ్తుంది..అదే సమయంలో టీడీపీకి సానుభూతి పెరుగుతుందని భావనలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇలాగె రాజీనామాల అస్త్రాన్ని ప్రయోగించారు. బీఆర్ఎస్ కూడా ఉద్యమ సమయంలో రాజీనామాల అస్త్రాన్ని ప్రయోగించింది.
ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలపై ఆలోచన చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరు రాజీనామాలు చస్తే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఎన్నికలకు మరో ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉండగా.. ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. అదే సమయంలో రాజీనామాల అస్త్రం ద్వారా వైసీపీని జాతీయ స్థాయిలో ఎండగట్టవచ్చు అనే వ్యూహంతో ఈ అంశంపై టీడీపీ లోతుగా అధ్యయనం చేస్తోంది. మరి దీనిపై పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read : బీఆర్ఎస్ లో బయటపడుతున్న కుమ్ములాటలు – కేటీఆర్ V/s హరీష్ రావు..?