ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. ఆయన వ్యవరశైలిని ఒకరిద్దరూ మినహా మిగలిన నేతలంతా వ్యతిరేకిస్తున్నారు. దాంతో వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఏఐసీసీపై ఒత్తిడి పెరుగుతోంది. మునుగోడులో పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు వెంకట్ రెడ్డి తెర వెనక ప్రయత్నాలు చేశాడంటూ ఆడియో క్లిప్ ను ఏఐసీసీకి టీపీసీసీ పంపింది. అయితే, ఆ ఆడియోలో వాయిస్ తనది కాదని చెప్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు వెంకట్ రెడ్డి.
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారశైలే కారణం. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా చెప్పుకొచ్చారు. తన విజయానికి కృషి చేస్తానని ఓటమికి కుట్రలు చేశాడంటూ ఆరోపించారు. బీజేపీ తరుఫున పోటీ చేసిన తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడితో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. దాంతో వెంకట్ రెడ్డి కుట్ర రాజకీయాలు బహిర్గతమయ్యాయి.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తేలడంతో వెంకట్ రెడ్డికి ఏఐసీసీ షోకాజ్ నోటిసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. ఆయన ఆస్ట్రేలియా పర్యటనలో ఉండటంతో తనకు నోటిసులు అందలేదని చెప్పడంతో ఇటీవల ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ మరోసారి షోకాజ్ నోటిసులు పంపింది. గురువారం వరకు వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. బీజేపీకి ఓటు వేయాలని బయటకు వచ్చిన ఆడియోలోని వాయిస్ తనది కాదని వెంకట్ రెడ్డి రిప్లై ఇచ్చారని తెలుస్తోంది.
అయితే , ఆడియోలోని వాయిస్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిదేనని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దీంతో ఆయన వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఏఐసీసీ ఎం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదివరకు వెంకట్ రెడ్డిని వెనకెసుకోచ్చిన వాళ్ళు సైతం తాజాగా ఆయన తీరును తప్పుబడుతున్నారు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై వేటు తప్పదని అంటున్నాయి రాజకీయ వర్గాలు.