-చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలు
-పిటిషన్లపై విచారణ జరపొద్దని రెండు రోజుల క్రితం వాదన
-బ్రిటిష్ కాలం నాటి చట్టంపై మోదీ సర్కార్ యూటర్న్
- మార్పులు అవసరమని, పరిశీలిస్తామని అఫిడవిట్ దాఖలు
వివాదాస్పద రాజద్రోహ చట్టంపై కేంద్ర ప్రభుత్వం యూ-టర్న్ తీసుకుంది. చట్టంలోని సెక్షన్ 214ఏ నిబంధనల్ని పునఃపరిశీలిస్తామని సుప్రీంకోర్టుకు తలిపింది. మార్పులకు అవకాశముందని వెల్లడించింది. బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిశీలనకు తీసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం చేసే మార్పుల కసరత్తు పూర్తయ్యేంత వరకు వేచి ఉండాలని కోరింది. అటు.. రాజద్రోహ చట్టాల రాజ్యాంగ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను మే 10 నుంచి వింటామని గతంలోనే సుప్రీంకోర్టు వెల్లడించింది. నేటి నుంచి పిటిషన్లు విచారణకు రానున్న నేపథ్యంలో కేంద్రం సోమవారం అఫిడవిట్ దాఖలు చేసింది.
పిటిషన్ లో పేర్కొన్న అంశాలివీ..!
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ ముందు కేంద్రం అఫిడవిట్ సమర్పించింది. 3 పేజీల దాఖలు చేసిన అఫిడవిట్ లో పలు అంశాల్ని పేర్కొంది. కాలం చెల్లిన చట్టాల్ని తొలగించడంతో పాటు దేశ సౌర్వభౌమత్వం, రక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. దేశం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో బ్రిటిష్ కాలం నాటి చట్టాల్ని తొలగించేందుకు కసరత్తు చేస్తున్నట్టు వివరించింది.