లోక్ సభ ఎన్నికల్లో సీఎం , పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ 14. కానీ కొన్ని చోట్ల కాంగ్రెస్ వెనకబడిందన్న ప్రచారం జరిగింది. అభ్యర్థుల్లో కూడా కొంత ఆందోళన కనిపించింది. కానీ, రేవంత్ రెడ్డి సీన్ లోకి దిగితే ఎలా ఉంటుందో రుచి చూపించారు.
నిజామాబాద్ , మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ వెనుకంజలో ఉందన్న ప్రచారం జరిగింది. కానీ, రేవంత్ రెడ్డి సోమవారం నిజామాబాద్, మాల్కాజ్ గిరి సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడమే కాదు. ప్రత్యర్ధి పార్టీ అభ్యర్థులను ఇరకాటంలోకి నెట్టేసేలా ప్రసంగించారు.
నిజామాబాద్ రైతుల చిరకాల వాంఛ అయిన పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని.. నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపించండి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా చేసే బాధ్యత నాదంటూ చెప్పుకొచ్చారు. అంటే జీవన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి అయితే నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏమంత కష్టం కాదు. అలా రైతులను ఆకర్షించేలా రేవంత్ రెడ్డి ప్రసంగం కొనసాగించారు. బీజేపీ, బీఆర్ఎస్ పసుపు బోర్డుపై హామీ ఇచ్చి మోసం చేయడంతో.. రేవంత్ మరోలా హామీ ఇచ్చి రైతులను ఆకర్షించే ప్రయత్నం చేశారు.
మల్కాజ్ గిరిలో ఈటల ప్రచారంలో దూసుకుపోతున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. కానీ మేధావులు , విద్యా వంతులు అధికంగా ఉండే ఈ సెగ్మెంట్లలో ఈటలను ఇరకాటంలోకి నేట్టేసేలా ప్రసంగించారు. ఓ మతానికి ప్రాధాన్యత కల్పించేలా మోడీ మాట్లాడుతుంటే కమ్యూనిస్ట్ అని చెప్పుకునే ఈటల ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అలాగే మంత్రిగా హుజురాబాద్ కు ఎం చేశావని నిలదీశారు. ఇవన్నీ ఆ ప్రాంత ప్రజలను ఆలోచింపజేసేవే.
దీంతో రేవంత్ ప్రణాళిక బద్దంగా ప్రసంగిస్తున్నారని అంటున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ ను రేసులోకి తీసుకొస్తున్నాయని.. రేవంత్ నిర్దేశించుకున్న లక్ష్యం మిస్ అవ్వదని అంటున్నారు.