ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పార్లమెంట్ వేదికగా తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని లేఖలో గుర్తు చేశారు. 8 ఏళ్లుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని లేఖలో ప్రస్తావించారు.
*లక్షాలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉన్న బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై నిర్లక్ష్యం మంచిది కాదన్నారు. పైగా ఏర్పాటు సాధ్యం కాదని తేల్చేయడం తెలంగాణ యువతకు నిరాశను కలిగించిందని పేర్కొన్నారు రేవంత్.
*కాజీపేట ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు దశాబ్దాల కల అని.. ఈ మేరకు విభజన చట్టం షెడ్యూల్ 13లో, 10వ అంశంగా పేర్కొన్నారని గుర్తు చేశారు. ఆ హామీని కూడా అటకెక్కించారన్నారు.
*తెలంగాణలో 12 శాతం గిరిజనులు ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు చట్టం హామీ ఇచ్చింది. ఇప్పటికీ ఏర్పాటుకు చొరవ లేదని ప్రస్తావించారు.
*పునర్విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్స్ లో చేర్చిన సంస్థలు, ఆస్తులు విభజన కొలిక్కి రాలేదు.
*రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు హామీ ఇంకా పరిపూర్ణం కాలేదు. పారిశ్రామికాభివృద్ధి కోసం ప్రత్యేక ఇన్సెంటివ్ లు ఇస్తామన్న హామీని నెరవేర్చలేదు.
*తెలంగాణకు దక్కాల్సిన ఐఐటీ, ఐఐఎం, వ్యవసాయ విశ్వ విద్యాలయం వంటి ఒక్క ఉన్నత విద్యా సంస్థ కూడా మంజూరు కాలేదని వివరించారు రేవంత్ రెడ్డి.
*హైదరాబాద్ ఐటీ పరిశ్రమను శిఖర స్థాయికి చేర్చే ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్టిమెంట్ రీజియన్) ప్రాజెక్టును రద్దు చేశారని అన్నారు. దీని వల్ల లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాకుండా పోయాయని అసహనం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ సర్కార్ అవినీతిపై మాటలు తప్ప చర్యలు శూన్యమన్న రేవంత్.. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, నడ్డా ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. దీనిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. కేసీఆర్ వైఖరికి బీజేపీ రాష్ట్ర శాఖలోని కొందరు నేతలు కూడా సహకరించే పరిస్థితి ఉందన్నారు.పైన పేర్కొన్న అంశాలపై కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
ప్రధాని మోడీకి రేవంత్ రాసిన లేఖ కింద చూడొచ్చు.