టీఆరెఎస్ కు చెందిన ఐదుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరనున్నారా..? ఇందుకు సంబంధించి వ్యవహారాలు కూడా పూర్తయ్యాయా..? మరికొద్ది రోజుల్లోనే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
టీఆరెఎస్ తరుఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న రాజ్యసభ సభ్యుల్లో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా వ్యాపారవేత్తలే. వారి ఆస్తులపై ఏ క్షణమైనా ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని లిక్కర్ స్కాం ఉదంతం బయటకు వచ్చిన నాటి నుంచి తెగ ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో లిక్కర్ స్కాం ఎపిసోడ్ లో ఎంపీ సంతోష్ రావు సన్నిహితుల ఇంట్లో ఈడీ అధికారుల సోదాలు జరగడం ఆ తరువాత సంతోష్ రావు రెండురోజులపాటు కనిపించకుండా పోయారనే వార్త మరిన్ని అనుమానాలను పెంచేసింది. ఈ లిక్కర్ స్కాం ఇంకా ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందో తెలియదు. ఇదిలా ఉండగానే టీఆరెస్ నేతలపై ఈడీ దాడులు త్వరలోనే జరుగుతాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేసిన దరిమిలా…టీఆరెస్ రాజ్యసభ సభ్యులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు చెప్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
త్వరలోనే ఐదుగురు టీఆరెస్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతారని, మరో ఎంపీతో చర్చలు జరుగుతున్నాయని ఆయన కూడా అంగీకరిస్తే వారంతా బీజేపీలో విలీనం అవుతారనే రేవంత్ ప్రకటన సంచలనంగా మారింది. ఇందుకు ప్రగతి భవన్ వ్యవహారాలను చక్కదిద్దే హ్యాపీ రావు నాయకత్వం వహిస్తున్నాడని ఆరోపించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేసీఆరే ఈ విధమైన జిమ్మిక్కులు చేస్తోండోచ్చునని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తుండటం గమనార్హం. రేవంత్ వ్యాఖ్యలను అంత ఈజీగా కొట్టిపారేయలేమని…నిప్పు లేకుండా పొగ రాదు కదా అంటున్నారు.