మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. అదే సమయంలో తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన భారత్ జోడో యాత్ర సూపర్ సక్సెస్ అయింది. గత మూడు నెలలుగా బిజీ షెడ్యూల్ తోనున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తిరిగి పార్టీ సంస్థాగత బలోపేతంపై ఫోకస్ చేయనున్నారు. మరో పది నెలలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ముందస్తు ఎన్నికలు కూడా జరిగే అవకాశం లేకపోలేదనే ఆలోచనతోనున్న రేవంత్… ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ నేతలను సమాయత్తం చేయనున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితం పార్టీ నేతలు, క్యాడర్ పై ఎలాంటి ప్రభావం పడకుండా చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఇందుకోసం మరికొద్ది రోజుల్లోనే పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలపై కార్యచరణ రూపొందించాలనే భావనతో ఉన్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా కొద్ది నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో నెలకొన్న స్తబ్దతను బద్దలు కొట్టాలని.. క్యాడర్ ను మళ్ళీ యాక్టివ్ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మినహా నేతలంతా భారత్ జోడో యాత్ర ద్వారా రేవంత్ తో కలిసి పని చేసేందుకు సై అనటంతో పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది.
ఈ ఉత్సాహాన్ని మున్ముందు కొనసాగాలని క్యాడర్ కోరుకుంటోంది. రేవంత్ ఆలోచన కూడా దాదాపు ఇదే. కాంగ్రెస్ ను బలహీనపరిచే కుట్రలు జరుగుతున్నాయన్న రేవంత్ రెడ్డి మాటలను ఆలస్యంగా అర్ధం చేసుకున్న నేతలు…వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని భావించడం పార్టీకి ఉత్తేజనిచ్చేదే. కాంగ్రెస్ ప్లేస్ ను అక్యూపై చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్న బీజేపీకి తెలంగాణలో బలపడే అవకాశం ఇవ్వొద్దని…అదే సమయంలో కేసీఆర్ వైఫల్యాలు, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్ళి అధికారమే లక్ష్యంగా పని చేయాలని నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డి లక్ష్యం పార్టీని అధికారంలోకి తీసుకోవడమే. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళిక బద్దంగా పని చేయాలని రూట్ మ్యాప్ రూపొందించుకోనున్నారు.