ఆధునిక భారత నిర్మాత, దేశాన్ని టెక్నాలజీలో పరుగులు పెట్టించిన దూరదృష్టి కలిగిన నాయకుడు, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ.
టెలీకమ్యూనికేషన్స్ విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన దార్శనికుడు రాజీవ్ గాంధీ. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి, ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది.
బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్.. సమసమాజ స్థాపన కోసం కృషి చేశారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో అత్యంత చిన్న వయస్సులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు రాజీవ్ గాంధీ.
1984 అక్టోబర్ 31న ఇందిర గాంధీ ప్రధాని దారుణ హత్యకు గురయ్యారు. దీంతో రాజీవ్ ప్రధానిగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. తల్లి మరణం బాధపెడుతున్నా ఎంతో ఓర్పుతో బాధ్యతలను భుజాలకెత్తుకున్నారు. ప్రధాని అయ్యే సమయానికి ఆయన వయసు 40 ఏళ్లే.
దేశ చరిత్రలో అందరి కంటే తక్కువ వయస్సులో ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. ప్రధాని అయ్యాక దేశ చరిత్రలో ఎన్నో కొత్త రికార్డులు నెలకొల్పారు. తల్లి అంత్యక్రియలు పూర్తికాగానే ఆయన లోక్ సభ ఎన్నికలకు ఆదేశించి ఘన విజయం సాధించారు. అంతకుముందు ఏడుసార్లు జరిగిన ఎన్నికల్లో కంటే రాజీవ్ హయాంలో ఎక్కువ సీట్లను సాధించారు.
కంప్యూటర్ రంగాన్ని మన దేశానికి పరిచయం చేసి, ఎంతో మంది విద్యార్థులు సాంకేతిక విద్యను నేర్చుకునేలా చేసింది రాజీవ్ గాంధీనే. గ్రామాల అభివృద్ధికి రాజీవ్ ఎంతగానో కృషి చేశారు. ఐటీ రంగంలో ఈనాడు మనదేశం అగ్రగామిగా ఉందంటే అది రాజీవ్ కృషి ఫలితమే. ఆధునిక భావాలు కలిగిన వ్యక్తిగా.. అంతర్జాతీయంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.
సాంకేతిక పరిశ్రమపై పన్నులను తగ్గించే సంస్కరణలను ప్రవేశపెట్టారు. టెలీకమ్యూనికేషన్స్, రక్షణ, వాణిజ్య, విమానయాన సంస్థలకు సంబంధించిన దిగుమతి విధానాలను సంస్కరించారు. ఆయన విధానాలు ఆర్థిక వ్యవస్థలో అధిక విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలను ఆధునీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
రాజీవ్ మనదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలీకమ్యూనికేషన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేశారు. ఇందిర హత్యకు వారం రోజుల ముందు ప్రవేశపెట్టిన పాలసీ ద్వారా సాఫ్ట్‌వేర్ ఎగుమతులు ప్రారంభమయ్యాయి. 1984లోనే ఈ విధానాన్ని ఇందిర కేబినెట్ ఆమోదించినా, రాజీవ్ ప్రభుత్వం 1984 నవంబర్ 18న ఈ విధానాన్ని ప్రకటించింది.
1986లో ఢిల్లీ, ముంబై టెలిఫోన్ సేవలను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది. అదే సంవత్సరంలో విదేశీ సమాచార నెట్‌వర్క్ లిమిటెడ్ ను స్థాపించింది.
మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ 1986లో రాజీవ్ ప్రభుత్వం కొత్త నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ ను ప్రవేశపెట్టింది. రాజీవ్ ప్రభుత్వం 1986లో ఆపరేషన్ బ్లాక్‌బోర్డ్‌ను ప్రవేశపెట్టి, 1987లో ప్రారంభించింది.
ప్రాథమిక స్థాయి విద్యార్థులకు వారి విద్యాభ్యాసాన్ని సులభతరం చేయడానికి అవసరమైన సంస్థాగత పరికరాలు, బోధనా సామగ్రిని అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించింది.
శ్రీలంక అంతర్యుద్ధంలో రాజీవ్ జోక్యం చేసుకున్నారని భావించిన ఎల్టీటీఈ తీవ్రవాదులు రాజీవ్‌ను దారుణంగా హత్య చేశారు. దేశంలోని తమిళ పార్టీల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల రాజీవ్ శ్రీలంకలోని తమిళులకు సహాయం అందించారు. 1989లోఅధికారంలోకి వచ్చిన రణసింఘే ప్రేమదాస శ్రీలంక నుంచి భారత బలగాల్ని ఉపసంహరించుకోవాలని కోరారు. మనదేశం వెంటనే శ్రీలంక నుంచి వైదొలిగింది. అయినప్పటికీ ప్రతీకారంతో ఉన్న ఎల్టీటీఈ తీవ్రవాదులు 1991 మే 21న శ్రీపెరంబుదూర్‌లో రాజీవ్‌ను హత్య చేశారు. ఆయన వర్థంతిని “ఉగ్రవాద నిరోధక దివస్”గా, ఆయన జయంతిని “సద్భావన దివస్” గా ఏటా జరుపుకుంటున్నాం.