గచ్చిబౌలిలో 400 ఎకరాల భూవివాదం ఓ పచ్చి నిజాన్ని బయటపెట్టింది. చాలా రోజులుగా రహస్యంగా సాగుతున్న బీఆర్ఎస్, బీజేపీ స్నేహం బట్టబయలైంది. నిజానికి కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానికే చెందినదని అక్కడ ఆందోళనలు చేస్తున్నవారికి కూడా తెలుసు. దాని వెనుకున్న నిజానిజాలను అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. సర్వేనం.25 లోని 400 ఎకరాల భూమిని 2004 లో నాటి ప్రభుత్వం క్రీడా సౌకర్యాల అభివృద్ధి కోసం IMG అకాడమీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కేటాయించింది. అయితే ఆ కంపెనీ ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూకేటాయింపును రద్దు చేసింది. దీంతో ఆ కంపెనీ 2006లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించిన అన్ని రుజువులను కోర్టుల్లో రుజువు చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఆ భూమి చట్టపరంగా తమదేనని, ఏ ప్రైవేట్ సంస్థకు లేదా వ్యక్తికి లేదా ఏ వర్సిటీకి చెందింది కాదని ఇటు హైకోర్టు అటు దేశ అత్యున్నత న్యాయస్థానం ద్వారా కూడా తెలంగాణ ప్రభుత్వం రుజువు చేసుకోగలిగింది.
అంతేకాదు అది అటవీశాఖకు చెందిన భూమి కాదని, దాంతో అటవీశాఖకు ఎలాంటి సంబంధం లేదని కూడా అధికారుల సర్వేలో తేలింది. ప్రస్తుతం టీజీఐఐసీ ఆధీనంలో ఉన్న ఆ భూమిలో ఎలాంటి బఫెలో లేక్, పీకాక్ లేక్ లాంటివి లేవని కూడా స్పష్టమైంది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదే అని అత్యున్నత న్యాయస్థానంలో కూడా తెలిపోయింది. కానీ రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే బీఆర్‌ఎస్, బీజేపీలకు తెలియడం లేదు.
హెచ్‌సీయూకు చెందిన భూమి అని కావాలని రాద్దాంతం చేస్తున్నారు. ఆ భూమిలో పులులు, సింహాలు లేవు కానీ కొన్ని గుంటనక్కలు ఉన్నాయని రేవంత్‌రెడ్డి చెప్పిన మాట అక్షరాలా నిజం. కానీ అక్కడున్న వణ్యప్రాణులకు ఏదో జరిగిపోతుందని మొసలి కన్నీరు కారస్తూ తప్పుడు ఫోటోలతో ప్రచారం చేస్తూ బొక్కబోర్లా పడుతున్నారు బీఆర్ఎస్, బీజేపీ నేతలు. సోమవారం ఓ జర్నలిస్ట్ ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా చేసిన ఓ పోస్టును పట్టుకొని తప్పుడు రాతలు రాస్తున్నారు. నిజానికి అతను పోస్ట్ చేసిన జింక ఫోటో గూగూల్ నుంచి డౌన్‌లోడ్ చేసింది. దానిపై సౌత్ ఫస్ట్ జర్నలిస్ట్ కూడా వివరణ ఇచ్చి క్షమాపణ కోరాడు.
ఆ 400 ఎకరాలపై కన్నుపడ్డ గుంటనక్కలు ఇప్పుడు చేస్తున్న డ్రామా అంతా ఇంతా కాదు. వణ్యప్రాణులకు ఏదో అయిపోతుందని మొసలి కన్నీరు కారుస్తున్నవాళ్లంతా…గతంలో ఓ బీఆర్ఎస్ నేత కాల్పుల్లో జింక చనిపోయినప్పుడు నోరు కుట్టేసుకున్నారు. ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నవాళ్లంతా ఎక్కడికిపోయారో అస్సలు అర్ధం కావడం లేదు.
అయితే ఈ కృత్రిమ ఆందోళనలన వెనుక బీఆర్ఎస్, బీజేపీ నేతలున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే కుట్ర చేసిన ఇద్దర్ని అరెస్ట్ చేశారు పోలీసులు. నిజానికి హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చొరవ తీసుకుంటుందన్నది జగమెరిగిన సత్యం. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఐఐసీ ద్వారా గచ్చిబౌలి, సైబరాబాద్ పరిసరాల్లో ఐటీ పరిశ్రమల్ని తీసుకువచ్చేలా భూముల కేటాయింపులు చేసింది. అప్పుడు తీసుకున్న చొరవ వల్లనే ఐటీ పరిశ్రమ ఇంతగా వృద్ధి చెందింది.
ఇప్పుడు మరోసారి రేవంత్‌రెడ్డి సర్కారు 400 ఎకరాల భూమిని టీజీఐఐసీ ద్వారా అభివృద్ది చేసి…హైదరాబాద్‌ను విశ్వపటంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్, బీజేపీలు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాయి. తాము చేయలేని పనిని రేవంత్‌రెడ్డి చేస్తుంటే ఓర్చుకోలేక కుట్రలు, కృత్రిమ ఆందోళనలు చేస్తున్నారు.