“హైదరాబాద్ ను రక్షించుకుందాం ప్రజల ప్రాణాలను కాపాడుకుందాం.
“జీవో 111 రద్దు-తుగ్లక్ జిద్దు”
కాకతీయులు నిర్మించగా గొల్లకొండగా ప్రసిద్ధిచెంది, కుతుబ్ షాహీ పాలనలో విస్తరించి, ఆసఫ్ జాహీ నవాబుల పాలనలో ఆధునికమైన మన హైదరాబాద్ నేడు ఐటీ రంగంలో ప్రపంచప్రఖ్యాతి పొందింది. ఎత్తైన దక్కన్ పీఠభూమి మీద ప్రకృతియే ఎయిర్ కండిషన్ చేసిన మన నగరం ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం వల్ల ప్రపంచంలోని అన్ని జాతుల ప్రజలకు వందల ఏళ్లుగా ఆవాసమైనది. మూసా(ప్రవక్త మోజెస్), ఈసా(ప్రవక్త జీసెస్) పేర్లతో పారుతున్న రెండు నదుల అలల మధ్య అలరారుతున్నజీవగడ్డ(దో ఆబ్) నేడు నిర్జీవగడ్డగా మారే దుస్థితి ఎదుర్కొంటున్నది.
వందేళ్ల కింద ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పర్యవేక్షణలో కట్టిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను బొందపెట్టడానికి సర్కార్ కుట్రపన్నింది. రియల్ ఎస్టేట్ మాఫియా తొడేలు ఆకలి తీర్చడానికి సరస్సులను మాయం చేస్తే పట్టణం నుంచి ఐటీ కంపెనీలు ఐపీ పెట్టి పారిపోతాయి. పదిలక్షల ఐటీ ఉద్యోగులు పరదేశం దారిపడతారు.
నగర ప్రజలను కానీ, పర్యావరణవేత్తలను కానీ, పట్టణంలోని ఐటీ కంపెనీలను గానీ సంప్రదించకుండా, ఏ రకమైన వివరణ ఇవ్వకుండా పట్టణం తలాపున ఏడు కోట్ల ఘణపుటడుగుల పాయిఖానాలను తయారుచేసి జీవజలాలను మాయంచేసే ప్రజాకంటక దుర్నీతిని తూర్పారపట్టడానికి ప్రజలు సమాయత్తమౌతున్నారు.
పట్టణాలకు చెరువులే మూత్రపిండాలు.
అడవులే ఊపిరితిత్తులు. చెరువులు, వాటి చుట్టూ అడవులు మాయమై భాగ్యనగరం కిడ్నీలు, లంగ్స్ లేని అభాగ్యనగంగా అఘోరిస్తుంది. భాజాభజంత్రీల మధ్య పల్లకి మీద ఊరేగుతున్న భాగ్యనగరం అవే భాజాభజంత్రీల మధ్య మృతనగరంగా పాడేమీద ఊరేగే దౌర్భాగ్యాన్ని మనం ఉహించగలమా?
దీనిపై తెలంగాణలో ఏ విశ్వవిద్యాలయంలోనైనా విద్యార్ధులు, అధ్యాపకుల మధ్య చర్చకు సర్కార్ సిద్ధమేనా? హైదరాబాద్ ను ఇక మీద మొయినాబాద్ అంత కుగ్రామంగా మార్చే కుట్రను తిప్పికొడుదాం.
ప్రజలతో మమేకమై, వారి పోరాటంలో భాగం కావడం కోసం ఈ ఏప్రిల్ 19(మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాల్సిందిగా కోరుతున్నాం. హైదరాబాద్ ను ముర్దాబాద్ కాకుండా ప్రజలు ఆగం కాకుండా కాపాడుకోవడానికి మీ వంతు సహకారం అందించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం.