అసలే అక్కడ ఇద్దరు అధికార పార్టీ నేతల మధ్య టికెట్ కోసం పంచాయితీ జరుగుతోంది. అందులో ఒకరు మాజీ ఎమ్మెల్యే కాగా, మరొకరు ప్రస్తుత ఎమ్మెల్యే. ఇద్దరు నేతలూ వచ్చే ఎన్నికల్లో టికెట్ నాదంటే , నాదేనని పోటాపోటీగా ప్రకటనలిస్తున్నారు. ఎవరూ తగ్గడం లేదు. ఇద్దరి మధ్య టికెట్ ఫైటింగ్ తారస్థాయికి చేరుతున్న సమయంలోనే.. ఈ ఇద్దరి మధ్యలో మరో నేత దూరిపోవడంతో ఇష్యూ మరింత ముదరడమో, ఎవరో ఒకరు పార్టీ జంప్ చేయడమో ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకీ ఎవరా నేతలు..?ఎదా నియోజకవర్గం అనేగా మీ సందేహం.. అయితే ఈ స్టొరీని చదివేయండి..
ఆ నియోజకవర్గం పాలేరు. ఇక్కడి నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుఫున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వర్ రావు వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ టికెట్ తనదే అంటూ ప్రకటించారు. ఇటీవల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి బల ప్రదర్శన చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తుమ్మలను ఓడించిన కందాల ఉపేందర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరడంతో , ఈసారి తాను కారు గుర్తుపై పోటీ చేస్తానని ప్రకటించారు. తుమ్మలకు పోటీగా ఉపేందర్ రెడ్డి కూడా బలప్రదర్శనలు చేశారు. కందాల తీరుతో తుమ్మల పార్టీ మారుతారని ప్రచారం జరిగినా ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో ఆయన మనస్సు మార్చుకున్నారని, అందుకే పార్టీ మార్పు వార్తలకు చెక్ పెట్టేందుకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి తాను కేసీఆర్ వెంటే ఉంటానని ప్రకటించారన్న అభిప్రాయాలు వినిపించాయి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తనకు మరో అవకాశం కల్పించాలంటూ తుమ్మల కోరడంతో.. టీఆరెస్ టికెట్ పై ఇద్దరి నేతల మధ్య మళ్ళీ లొల్లి షురూ అయినట్లు అయింది.
రాష్ట్రంలో టీఆర్ఎస్ తోనే వామపక్షాలు కలిసి సాగుతాయని ప్రకటించిన నేపథ్యంలో కమ్యూనిస్టులకు కేటాయించే సీట్లపై చర్చ జరుగుతోంది. పాలేరు, మధిర, భద్రాచలం, మిర్యాలగూడ, నల్గొండ స్థానాలను సీపీఎం, వైరా, కొత్తగూడెం, దేవరకొండ, హుస్నాబాద్ సీట్లను సీపీఐ అడుగుతుందని ఆ పార్టీల ముఖ్య నేతలు చెబుతున్నారు. పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం, కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావులు పోటీ చేయనున్నారని అంటున్నారు. అసలే , పాలేరు టికెట్ కోసం ఇద్దరు అధికార పార్టీ నేతలు ఎవరికీ వారు ప్రయత్నాలు చేస్తుంటే పొత్తులో భాగంగా టికెట్ ను తమ్మినేని తన్నుకుపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వచ్చే ఎన్నికల్లో వామపక్షాలకు కేటాయించే సీట్లపై కేసీఆర్ తో చర్చ జరిగింది. అందులో భాగంగా తమ్మినేని వీరభద్రం ఐదు స్థానాలను సీపీఎంకు కేటాయించాలని కోరగా..అందుకు కేసీఆర్ కూడా చూచాయగా అంగీకరించారని అందులో భాగంగానే పాలేరు నియోజకవర్గంలో బలం పెంచుకునేందుకు తమ్మినేని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పాలేరులో సీపీఎం పోటీ చేసి విజయం సాధించడం ఖాయమని తమ్మినేని ప్రకటించడం కూడా ఇందులో భాగమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు సీటు మాదంటే మాదంటూ ప్రకటిస్తుండగా, ఇప్పుడు తమ్మినేని కూడా పాలేరు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో ఎవరికి పోటీ చేసే అవకాశం దక్కినా, మిగిలిన ఇద్దరికీ నిరాశే ఎదురు కానుంది.