హైడ్రామాకు తెరదించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీతోపాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి లాజిక్ లేకుండా మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తున్నానని ఓసారి… మరోసారి కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకే రాజీనామా అంటూ నాలుక మడతేశారు. అంతేకాదు.. తన రాజీనామా మునుగోడు ఆత్మగౌరవానికి సంబంధించినది అంటూ నియోజకవర్గ ప్రజల నుంచి సానుభూతి పొందే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయాలో తనదైన ముద్ర వేసుకున్నాడు. కాని తను కాంగ్రెస్ కోసం త్యాగం చేశానని మాట్లాడం ఆశ్చర్యపరిచింది. 2009లో వ్యాపారవేత్తగా ఉన్న రాజగోపాల్ కు భువనగిరి లోక్ సభ స్థానం నుంచి ఎంపీ అవకాశం కల్పించింది కాంగ్రెస్. 2014లో భువనగిరిలో ఓటమి పాలైతే ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి గౌరవించింది. ఆ తరువాత 2018ముందస్తు ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించి రాజగోపాల్ రెడ్డికి పార్టీలో అధిక ప్రాధాన్యత ఇచ్చింది. కాని ఆయన పార్టీ వీడుతు కాంగ్రెస్ కోసం తాను త్యాగం చేశానని వ్యాఖ్యానించడం ఏంటో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. పార్టీలో ఎప్పుడు పదవుల కోసం వెంపర్లాడుడు తప్పితే.. పార్టీ పటిష్టం కోసం కృషి చేయని నైజం రాజగోపాల్ రెడ్డిదని కాంగ్రెస్ నాయకులు గుర్తుచేస్తున్నారు.
ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్ తీరు నచ్చకే పార్టీని వీడుతున్నానని వ్యాఖ్యానించారు రాజగోపాల్ రెడ్డి. 2019లో పీసీసీ అద్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలోనే తాను బీజేపీలో చేరుతానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా రేవంత్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు ఆయన తీరు నచ్చలేదని మాట్లాడేశారు. సీఎల్పీ పదవి తనకు కాకుండా భట్టి విక్రమార్కకు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక తీవ్ర విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి పార్టీ గీత ఎప్పుడో దాటేశాడు. అయినా సహనంతో భరించిన కాంగ్రెస్ కు రాజగోపాల్ రెడ్డి చేసిన త్యాగం ఏంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. సోనియా గాంధీ అంటే గౌరవమని అంటూనే… గాంధీ కుటుంబంపై రాజకీయ కక్షతో ఈడీ దాడులు చేస్తున్న కమలం కాంపౌండ్ లో రాజగోపాల్ రెడ్డి సరెండర్ కావడం కుటిల నీతికి నిదర్శనమనే విమర్శలు గుప్పుమంటున్నాయి.
తన వ్యాపారంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాజగోపాల్ రెడ్డి ఈ గండం నుంచి గట్టేకేందుకు బీజేపీతో చెలిమి కోసం ఎప్పుడో ప్రయత్నించాడు. అందుకే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని గతంలోనే వ్యాఖ్యానించి బీజేపీ నేతల అటెన్షన్ తన వైపు మొగ్గేలా చూసుకున్నాడు. ఆ తరువాత బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వానికి కోమటిరెడ్డి ఎపిసోడ్ ను నివేదించడంతో అమిత్ షా రాజగోపాల్ రెడ్డినీ పిలిచి మాట్లాడారు. నిన్ను ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇవ్వడంతో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి బీజేపీలోకి చేరేందుకు సిద్దమై పోయాడు. రాజగోపాల్ రెడ్డికి 21వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది.
ఏదీ ఏమైనా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటం హస్తం పార్టీకి మంచి చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆయనతో పార్టీకి భారం తప్పితే ప్రయోజనం లేదని చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సెమి ఫైనల్ లాంటిదని.. సిట్టింగ్ సీటును కాంగ్రెస్ కాపాడుకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..!