–గులాబీ బాస్ ఏం చేయనున్నారు..?
మునుగోడు ఉప ఎన్నిక ముగిసినా టీఆర్ఎస్ , బీజేపీ ల మధ్య డైలాగ్ వార్ ఆగడం లేదు. ఈసారి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ విషయమై రెండు పార్టీ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన ఫ్యాక్టరీని జాతికి అంకితం ఎలా ఇస్తారని టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కర్మాగారంలో 95శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధానిని అడ్డుకుంటామని వామపక్ష విద్యార్ధి సంఘాలు ప్రకటించాయి. టీఆర్ఎస్ అభ్యంతరాలపై బీజేపీ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. దీంతో ప్రధాని రామగుండం టూర్ టెన్షన్ రేకెత్తిస్తోంది.
ప్రధాని తెలంగాణ పర్యటనలో సీఎం కేసీఆర్ పాల్గొనే అవకాశం లేదు. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చాలని మోడీ – షా లు ప్రయత్నించారని మీడియా సమావేశంలో స్వయంగా కేసీఆరే చెప్పారు. మరీ, ఈ పర్యటన సందర్భంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు ప్రభుత్వ ప్రతినిధిగా ఎవరినైనా పంపిస్తారా..? ప్రోటోకాల్ ను సైతం పక్కనపెట్టేసి బీజేపీపై తాము చేస్తోన్న పోరు ఎంత గట్టిదో ప్రదర్శించుకునేందుకు దీనిని ఓ అవకాశంగా మలుచుకుంటారా..? అన్నది తెలియాల్సి ఉన్నది.
నిజానికి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్దరణకు చర్యలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. నష్టాలు వస్తున్నాయనే సాకుతో 1999లో ఈ ఫ్యాక్టరీని బీజేపీ మూసివేసినా…కర్మాగారంపైనున్న రుణాలు, అప్పులు మొత్తం 10వేల కోట్లు మాఫీ చేసి , 2015లోనే ఫ్యాక్టరీ పునరుద్దనరణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంది కాంగ్రెస్. గత ఏడాదే ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. ఇప్పుడు కొత్తగా ఫ్యాక్టరీని ప్రారంభించినట్లు జాతికి అంకితం ఇస్తామని బీజేపీ చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కాంగ్రెస్ క్రెడిట్ ను బీజేపీ పొందేందుకు ఆరాట పడుతుండగా…దీనిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది.
టీఆర్ఎస్ – బీజేపీలు ఆడుతోన్న నాటకాలను వివరించడంలో మాత్రం కాంగ్రెస్ వెనకబడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.