మునుగోడు ఉప ఎన్నికల్లో అంచనాలు తలకిందులు అవుతున్నాయి. రాజకీయ విశ్లేషకులకు కూడా అందని విధంగా సర్వే ఫలితాలు ఉండటం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ ఉప ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు ఉంటుందని విశ్లేషించారు కాని, ఒక్కొక్కటిగా వెలువడుతోన్న సర్వే ఫలితాల్లో బీజేపీ కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడం రాజకీయ పండితులను కూడా ఖంగుతినిపిస్తోంది. కాంగ్రెస్ – టీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని తాజాగా వెలువడిన సర్వే రిపోర్ట్ లో తేలింది.
మిషన్ చాణక్య అనే సర్వే సంస్థ తాజాగా విడుదల చేసిన సర్వేలో టీఆర్ఎస్ కు కాస్త ఎడ్జ్ ఉన్నట్లు తేలింది. అంతమాత్రానా టీఆర్ఎస్ కు అంత ఈజీగా విజయం దక్కే సూచనలు లేనట్లుగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ కు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంటుందని సర్వేలో తేలింది. బీజేపీకి ఈఫలితాలు మింగుడు పడనివే. టీఆర్ఎస్ 37 శాతం, కాంగ్రెస్ 34శాతం, బీజేపీ కేవలం 25శాతం ఓటు బ్యాంక్ ను దక్కించుకుంటాయని సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఐతే, రోజురోజుకు జరుగుతోన్న పరిణామాలు ఓటర్లను కాంగ్రెస్ వైపు చూసేలా చేస్తున్నాయి.
రేవంత్ వరుస పర్యటనలు, కాంగ్రెస్ లో కొంతమంది కోవర్ట్ ల రాజకీయం, పాల్వాయి స్రవంతి అభివృద్ధి మంత్రం హస్తం గ్రాఫ్ ను పెరిగేలా చేస్తోన్న నేపథ్యంలో 37శాతం ఓట్లతో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతున్నా కారు పార్టీని కలవర పెడుతోంది. టీఆర్ఎస్ , బీజేపీ పార్టీలు మునుగోడును డబ్బుల ప్రవాహంతో ముంచేత్తుతున్నా..కాంగ్రెస్ పోటీనిస్తుండటం ఆ రెండు పార్టీలను ఆలోచనలో పడేస్తోంది. కాంగ్రెస్ ను తేలిగ్గా తీసుకుంటే విజయం చేజారిపోతుందని టీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది.
రాజకీయ అవసరాల కోసం బీజేపీని ప్రత్యర్ధిగా ప్రదర్శిస్తే.. అదే ఏకు మేకై గుచ్చుకునేలా ఉందని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. అందుకే, మునుగోడులో కాంగ్రెస్ ను బలహీనం చేసేందుకు ఎం చేయాలన్న దానిపై ప్రగతి భవన్ లో వ్యూహాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.