తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు మరియు పరిశ్రమల పేర్లతో వేలాది ఎకరాల వ్యవసాయ భూములు ప్రజల నుండి బలవంతంగా సేకరిస్తుంది. “నిర్వాసితుల త్యాగాలు వెలకట్టలేనివి మేము వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటాం వారికి ఎంత చేసిన తక్కువే”. అని గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ప్రజాప్రతినిధులు, అధికారులు అంటున్న మాటలు. కానీ పై మాటలకు భిన్నంగా రావాల్సిన నష్టపరిహారం సంవత్సరాలైనా ఇవ్వకపోవడం ప్రశ్నించిన నిర్వాసితులను కేసులు పెట్టి బేడీలు వేసి వేధించడం.ప్రజా ప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు నిర్వాసితుల పట్ల వ్యవహరిస్తున్న తీరు మనకు కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. భూ నిర్వాసితుల పట్ల
“ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టుగా ఉంది”. ప్రభుత్వం తీరు.
తెలంగాణ రాష్ట్రం అవతరించిన రెండు సంవత్సరాల తర్వాత సరిగ్గా 16 మే 2016 రోజున మల్లన్న సాగర్ నిర్మిస్తున్నట్లు ఆయా గ్రామాల భూములు , ఇండ్లు ప్రభుత్వం సేకరిస్తున్నట్టు గెజిట్ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రకటన వెలువడక ముందు నుండే ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు “మల్లన్న సాగర్ వద్దు మా గ్రామాలు మాకు ముద్దు” అనే నినాదంతో ఉద్యమాలను చేపట్టారు. ఈ ఉద్యమాన్ని పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం యొక్క డివైడ్ అండ్ రూల్ పాలసీని ఉపయోగించి ఉద్యమాన్ని ఒక వైపు నీరు కారుస్తూ ఇంకొకవైపు ప్రతి గ్రామంలో రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు సహకరించకపోతే ఇంకొక గ్రూప్ నుండి సహకారం తీసుకోని నయనో, భయానో మొత్తం మీద సుమారు 17,600 ఎకరాల భూమిని సేకరించి 7400 కోట్ల రూపాయల ఖర్చుతో నాలుగు సంవత్సరాలలో ప్రాజెక్టులు పూర్తి చేసింది.
సిద్దిపేట జిల్లా తొగుట మండలం గ్రామాలు ఏటిగడ్డకిష్టాపూర్ , వేములఘట్,లక్ష్మాపూర్, రాంపూర్, తిరుమలగిరి, వడ్డెరకాలనీ ,పల్లెపహాడ్, దస్తగిరినగర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, మొగుళ్లచెరువుతండా, నగరంతాండ ,తురకబంజేరుల్లి, కొండపాక మండలంలోని ఎర్రవల్లి, సింగారం గ్రామాలు మొత్తం 14 గ్రామాలు పూర్తిగా ముంపుకు గురిఅయినాయి. తొగుట ,తుక్కాపూర్ ,తిప్పారం, మంగోలు గ్రామాల వ్యవసాయ భూములను కోల్పోయారు. సుమారు 5,212 కుటుంబాలు సుమారు 25 వేల జనాభా భవిష్యత్ తరాలకు వారి త్యాగాలతో బంగారు పంటలు పండించుకోవడానికి వారు సర్వస్వాన్ని త్యాగం చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి మల్లన్న సాగర్ ద్వారా దాదాపు పది జిల్లాలకు సాగు,తాగు పరిశ్రమలకు హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టును పూర్తిచేసి గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో సుమారు 10 TMC నీటిని నింపిన విషయం తెలిసిందే! నీళ్లు నింపడానికి ముందుగా ఆరు నెలల ముందు నుండి ప్రభుత్వాధికారులు గ్రామాలకు వచ్చి గజ్వేల్ పట్టణ ప్రాంతంలోని ముట్రాజ్ పల్లి, సంగాపూర్ గ్రామాల పరిధిలో సుమారు 2500 శాశ్వత(నాణ్యత లోపంతో నిర్మించిన ఇండ్లుగత వాన కాలంలో గోడలు కూలి, వానలకు నీరు ఇండ్లలోకి వచ్చాయి.) ఇండ్లలోకి, మిగిలిన వారిని పట్టణ ప్రజలకు నిర్మించిన తాత్కాలిక డబుల్ బెడ్ రూమ్ లోకి ఆయా గ్రామాల ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించారు. ఆయా గ్రామాలు ఖాళీ చేయడానికి ఇష్టపడని గ్రామస్తులను గ్రూపులుగా విభజించి ఒక గ్రూప్ సహకరించకపోతే ఇంకొక గ్రూప్ తయారు చేసి మీరు ఖాళీ చేసిన ఒక నెలలోపు మీకు రావాల్సిన అన్ని రకాల నష్ట పరిహారాలను మీ ఇంటికి వచ్చి ఇచ్చేస్తామని నమ్మ బలికిన అధికారులు ఇప్పటికీ ఎలాంటి న్యాయపరంగా రావలసిన పరిహారాన్ని అందించలేకపోవడం నిర్వాసితులను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పిన దానికి నిదర్శనం.
గ్రామాలను ఖాళీ చేసేటప్పుడు రవాణా సౌకర్యాన్ని ఇస్తామన్న ఇతర ప్రాంతాలలో కిరాయికి తీసుకున్న కుటుంబాలకు ఆరు నెలల కిరాయి డబ్బులు, ప్యాకేజీలు,ఇండ్లు,ఇండ్ల స్థలాలలకు పట్టాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. సుమారు 5000 కుటుంబాలు నివసిస్తున్న ఈ కాలనీకి అత్యవసరంగా వైకుంఠధామాన్ని నిర్మించాలని నిర్వాసిత గ్రామాల ప్రజలు సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు ప్రభుత్వాధికారులకు విన్నవించుకున్న కూడా సంవత్సరం దాటుతున్న నిర్మించకపోవడం అధికారుల తీరుకు నిదర్శనం. అధికారుల మాటలు నమ్మిన నిర్వాసిత గ్రామాల సర్పంచులు ఆయా గ్రామ ప్రజలకు మేము మీకు రావలసిన నష్టపరిహారాన్ని తప్పకుండా ఇప్పిస్తామని చెప్పి ఖాళీ చేయించారు. ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడంతో నష్టపరిహారం రావలసిన నిర్వాసితులు ప్రతిరోజూ సర్పంచుల ఇండ్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
ఖాళీ చేసిన నెలలోపు న్యాయంగా రావాల్సిన నష్టపరిహారం ప్యాకేజీలు, ఇండ్ల స్థలాలు అన్ని ఇస్తామన్న అధికారులు ఇప్పటివరకు ఇవ్వకపోవడం నిర్వాసితుల పట్ల ప్రభుత్వానికి ఉన్న ప్రేమకు నిదర్శనం.
ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆయా గ్రామాల ప్రజలతో ప్రజా ప్రతినిధులు, కలెక్టర్ ,ఇతర అధికారులు ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్నా రైతులకు పట్టా భూములతో సమానంగా పరిహారమిస్తామని,గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఒంటరి మహిళలకు, పురుషులకు వయస్సుతో నిమిత్తం లేకుండా ప్యాకేజీ ఇస్తామని, ఇండ్లు నిర్మించి ఇంటి స్థలాలను పట్టా పేపర్లు ఇచ్చిన తర్వాతనే ఊరు కాళీ చేయాలని గ్రామాలను దత్తత తీసుకుంటామని, ఉమ్మడి మెదక్ జిల్లా BC,SC,ST, కార్పొరేషన్ల నుండి సగం నిధులను ఈ గ్రామాలకు కేటాయిస్తామని, యువతి,యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తన ఎంపీ నిధులలో ప్రతి సంవత్సరం సగం నిధులు కేటాయిస్తానని హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేరలేదు.
ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మల్లన్న సాగర్ ఉద్యమ సమయంలో టిడిపి నేతగా గ్రామాలను ముంపుకు గురి చేయవద్దని ఒకవేళ గ్రామాలను ముంపుకు గురి చేస్తే ఎకరాకు 6లక్షల రూపాయలు కాదు మార్కెట్ రేట్ ప్రకారం ఇయ్యాలనే డిమాండ్ తో మల్లన్న సాగర్ గ్రామమైన ఏటిగడ్డ కిష్టాపూర్ లో రెండు రోజులు నిరాహార దీక్ష చేపట్టారు. కానీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఏమి న్యాయం చేస్తాడో చెప్పలేదు.
మల్లన్న సాగర్ లోని ముంపుగురైన 14 గ్రామాలలో 12 గ్రామాలు దుబ్బాక నియోజకవర్గం గ్రామాలే మల్లన్న సాగర్ నిర్మాణం చేపట్టే నాటికి దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యేగా సోలిపేట రామలింగారెడ్డి గారు ఉన్నారు. 2019లో రామలింగారెడ్డి గారి ఆకస్మిక మరణంతో దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఉప ఎన్నికల బరిలో నిలిచిన బిజెపి అభ్యర్థి ఇప్పటి దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ రఘునందన్ రావు గారు మొట్టమొదటగా మల్లన్న సాగర్ నిర్వాసితులకు కొండపోచమ్మ ,రంగనాయక సాగర్ లో ఇచ్చిన నష్టపరిహారాన్ని నేను గెలిచిన ఆరు నెలల్లోపు అంత నష్టపరిహారం ఇప్పించకపోతే నేను రాజీనామా చేస్తానని ఎన్నికలకు ముందు పలు సందర్భాలలో పత్రికలలో టీవీ ఇంటర్వ్యూలలో చెప్పాడు. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మల్లన్న సాగర్ గ్రామాలకు ఒక్కసారి కూడా రాలేదు. ప్రభుత్వం పోలీస్ పహారాలు పెట్టి నష్టపరిహారం ఇవ్వకుండా నిర్వాసిత గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయిస్తుంటే కూడా స్థానిక ఎమ్మెల్యే నిర్వాసితుల పక్షాన నిలబడలేదని, మళ్లీ వచ్చే ఎన్నికలలో ఆయానిర్వాసిత గ్రామాల ఓటర్లు దుబ్బాక నియోజకవర్గం నుండి గజ్వేల్ నియోజకవర్గానికి పోతున్నారు కాబట్టి దుబ్బాక ఎమ్మెల్యే గారికి మా నిర్వాసిత గ్రామాల ఓట్లు అవసరం లేదని అందుకే పట్టించుకోలేదని ప్రజలు అంటున్నారు.
మల్లన్న సాగర్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తే మా కష్టాలు తీరిపోతాయి అనుకున్నా మల్లన్న సాగర్ నిర్వాసితుల అనుకొన్న రోజు రాని వచ్చింది.
23 ఫిబ్రవరి 2022 రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు అధికారికంగా మల్లన్న సాగర్ ప్రారంభించారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ “నిర్వాసితుల త్యాగాలు వెల కట్టలేనివి వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని” ఇంకా ఏమైనా వారికి రావలసిన నష్టపరిహారం ఉంటే ఇవ్వవలసిందిగా వెంబడే 100 కోట్ల రూపాయలు సాంక్షన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. “దేవుడు కరుణించిన పూజారి కరుణించడం లేదు అనే” చందంగా ముఖ్యమంత్రి గారు నిర్వాసితుల పట్ల కొంత మానవతా దృక్పథంతో ఉన్నప్పటికీ అధికారులు మాత్రం మానవత్వం చూపించడం లేదని స్థానిక నిర్వాసిత గ్రామ ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు చోరువ తీసుకొని నిర్వాసితుల న్యాయమైన పరిహారం ఇవ్వవలసిందిగా ప్రజలు అంటున్నారు.
అన్ని ప్రాజెక్టుల నిర్వాసితులకు రావలసిన నష్టపరిహారాన్ని ఇండ్లను ,ఇండ్ల స్థలాలకు పట్టాలను, చేపల పట్టుకునే హక్కులను వెంటనే ఇవ్వాలి.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని మొదటగా నిర్వాసిత గ్రామాల దళితులకు ఇవ్వాలి. నిర్వాసిత గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ 100 రోజుల పనిని కల్పించాలి.ఎర్రవల్లి, నరసన్నపేట, చింతమడక, వాసాలమర్రి గ్రామాల లాగా ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలి.
భూనిర్వాసితుల పైన పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలి. అర్హులైన యువతి యువకులకు స్థానిక పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. నిర్వాసిత గ్రామాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూడాల్సిన పనిలేదు కానీ అవమానించకండి.
పులి రాజు,
సామాజిక కార్యకర్త,
9908383567.