బీఆర్ఎస్ కు సిగ్గు లేదు..బీజేపీకి శరం లేదు. అవును. ఇది విమర్శ కాదు. అసలు విషయం తెలిస్తే మీరే ఈ రెండు పార్టీలను ‘ఛీ’ కొడుతారు. రెండు పార్టీలను తప్పుబడుతారు.
ఇంతకీ విషయం ఏంటంటే.. దేవరకొండ మండలం చిన్నబావి గ్రామానికి చెందిన లక్ష్మి…బీజేపీ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు. బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తుందని.. అందులోనూ ఓ మహిళ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పని చేస్తుందని అధికార పార్టీ నాయకులు ఆమెను లైంగికంగా వేధించారు. అయినా భరించింది. కానీ ఇటీవల ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడి బీఆర్ఎస్ నాయకులు లైంగికంగా వేధించారు. తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. పది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. బీజేపీకి నిస్వార్ధంగా పనిచేసిన లక్ష్మి మరణవార్త బయటకు వచ్చేంత వరకు ఆమెపై లైంగిక దాడి జరిగిన విషయం ఎక్కడ బయటకు రాలేదు.
లక్ష్మి మరణానికి ముమ్మాటికీ కారకులు బీఆర్ఎస్ నాయకులే. మాట మాట్లాడితే బీఆర్ఎస్ పై నిఖార్సుగా పోరాడుతున్నది తామేనని చెబుతున్నారు కానీ సొంత పార్టీ నాయకురాలిపై లైంగిక దాడి జరిగితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎందుకు పట్టించుకోలేదు..? పదిరోజులుగా ఏం చేసినట్టు..? కనీసం బాధితురాలిని పరామర్శించినట్లు కూడా సమాచారం లేదు. నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వలేదు. సొంత పార్టీ మహిళా నేతకే అండగా నిలబడని బీజేపీ నేతలు.. సామాన్య ప్రజల కోసం వారి గొంతును వినిపిస్తారా..? అనేది ప్రశ్నే.
ఇక.. బీఆర్ఎస్ నేతలు తమ హయంలో షీ టీమ్స్ తీసుకొచ్చాం. మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం. క్రైం రేట్ తగ్గిందని తెగ చెప్పుకుంటున్నారు కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అధికార పార్టీ నేతలు అధికార గర్వంతో చెల్లుబాటు అవుతుందని లైంగిక దాడులకు తెగబడుతున్నారు. అయినా కాపాడాల్సిన వారే కామంతో రగిలిపోతుంటే.. వారి చేతిలోనున్న వ్యవస్థలు మాత్రం ఎలా రక్షణ కల్పిస్తాయి..? లక్ష్మిపై లైంగిక దాడికి పాల్పడింది అధికార పార్టీ నాయకులు. ఈ విషయమై బాధితురాలి కుటుంబ సభ్యులు లిఖితపూర్వకగా ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదంటే… వారి వెనక అధికార పార్టీ నేతల అండదండలు లేవానుకోవాలా.?
లైంగిక వేధింపులతో ఆత్మహత్యయత్నం చేసి పదిరోజులు ఆసుపత్రిలో ఉంటే ఆమెను కాపాడుకునేందుకు పార్టీ పరంగా సాయం అందలేదు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలనే ఆదేశాలు రాలేదు. ఎందుకంటే ఆమె అతి సామాన్యమైన లీడర్. లైంగిక వేధింపులకు లక్ష్మి ప్రాణం తీసుకుంది. ఆమె ఎలాగు తిరిగిరాదు..కనీసం ఆమె అత్మకు శాంతి చేకూరాలంటే నిందితులకు కఠిన శిక్ష పడేలా చేయడమే బీజేపీ కర్తవ్యం. మరి ఆ పని చేస్తుందా..? లేదంటే.. బీఆర్ఎస్ తో ములఖాత్ అయి.. అతి సామాన్యమైన మహిళా నేత కోసం సమయం వృధా చేసుకోవడం ఎందుకని అనుకుంటారా..?
Also Read : బీఆర్ఎస్ నాయకుల లైంగిక వేధింపులకు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు బలి