తెలంగాణ జన సమితి అద్యక్షుడు కోదండరాం మౌనంపై కొంతకాలంగా జోరుగా చర్చ జరుగుతోంది. ఆయన బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని ప్రచారం జరగగా…అదే సమయంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనతో సంప్రదింపులు జరిపారనే వార్తలు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిని ఆ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నా నిప్పు లేకుండా పొగ ఎలా వస్తుందని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
టీజేఎస్ అద్యక్షుడిగా కంటె కూడా టీజేఏసీ అద్యక్షుడిగా కోదండరాం సుపరిచుతులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జన సమితి పార్టీని స్థాపించినా అనుకున్నంతగా పార్టీ సక్సెస్ అవ్వలేదు. రాజకీయ చదరంగంలో తనదైన ముద్ర వేయలేకపోయారు. జన సమితిలోనున్న కొద్దోగొప్పో ప్రజాబలం, ఆర్థిక బలం కల్గిన నేతలు కూడా తక్కువ కాలంలోనే టీజేఎస్ ను వీడారు. ప్రస్తుతం ఆ పార్టీని రాజకీయ నిరుద్యోగులు షెల్టర్ గా వాడుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలపై చర్చ జరుగుతోన్న వేళ టీజేఎస్ చర్చే లేకుండా పోయింది. రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన కోదండరాం ఆ క్రెడిట్ ను ఒన్ చేసుకోలేకపోతున్నారు. ప్రజలకు నాటి వాస్తవ పరిస్థితులను వివరించి చేరువ కాలేకపోతున్నారు. ప్రజా బలం లేదనేమో టీఆర్ఎస్ సర్కార్ గతంలో అర్దరాత్రి ఆయన ఇంటి తలుపులు బద్దలుకొట్టి కోదండరాం అరెస్ట్ కు ఆదేశించింది. ప్రభుత్వ సర్కార్ వైఫల్యాలను అస్త్రాలుగా చేసుకొని కాంగ్రెస్ , బీజేపీలతోపాటు వైఎస్ఆర్ టీపీ కూడా ఉద్యమిస్తోన్నా టీజేఎస్ మాత్రం పత్తాకు లేకుండా పోయింది. దీంతో రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్ధకంగా మారింది.
Also Read : ఇంతకీ వైఎస్ షర్మిల ఎవరు వదిలిన బాణం..?
మునుగోడు ఉప ఎన్నికల బరిలో నిలిచినా పెద్దగా ప్రభావం ప్రదర్శించలేకపోయింది టీజేఎస్. పార్టీ ఉనికిలోనే ఉందనే మెసేజ్ ను జనాల్లోకి తీసుకెళ్లడం కోసమే బరిలో అభ్యర్థిని నిలిపారన్న అభిప్రాయాలు కూడా వినిపించాయి. మునుగోడు బైపోల్ హీట్ కొనసాగుతున్న సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు ఇష్యూ తెరపైకి రావడం, లిక్కర్ స్కాం ప్రకంపనలు తారాస్థాయికి చేరినా కోదండరాం మాత్రం పెద్దగా ఈ విషయాలను పట్టించుకోలేదు. ప్రజాస్వామ్యం గురించి అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చే కోదండరాం.. ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ పై పెద్దగా రియాక్ట్ అవ్వకపోవడం, ఈ కేసు నిందితుల్లో ఒకరైన సింహయాజులుతో ఆరు నెలల కిందటే కోదండరాం భేటీ అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.
దీనిపై ఆయన తాజాగా వివరణ ఇచ్చుకున్నారు. ఆయన్ను ఆధ్యాత్మిక దృష్టితోనే కలిశానని ఇందులో రాజకీయం ఏమి లేదని చెప్పుకొచ్చారు. సింహయాజులకు రాజకీయాలతో సంబంధం ఉన్నట్లు ఇప్పుడే తెలిసిందని చెప్పుకొచ్చారు. అయితే, బీజేపీ ఆరు నెలల నుంచే ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్లాన్ చేయడంతోపాటు, ముఖ్య నేతలను పార్టీలో జాయిన్ చేసుకునేందుకు ప్లాన్ చేసినట్లు సిట్ విచారణలో తేలింది. అంటే మొదట్లోనే కోదండరాంతో సింహయాజులు రాజకీయ పరమైన చర్చ చేసి ఉండొచ్చుననే వాదనలు కూడా వస్తున్నాయి. బీజేపీలో చేరితే గవర్నర్ పదవి ఇస్తామని పార్టీ నుంచి ఆఫర్ వచ్చినట్లు గతంలో ఎన్నోసార్లు లీకులు రాగా సింహయాజులుతో కోదండరాం భేటీ అయినట్లు తాజాగా తేలడం చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయం గ్రహించే మంత్రి కేటీఆర్ కూడా కోదండరాంను టీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానం పంపారని…. గతంలో జరిగిన విషయాలను మనస్సులో పెట్టుకోవద్దని ఆయన్ను కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన టీఆర్ఎస్ పై తన మునుపటి దూకుడును తగ్గించారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్నికల సమయం వరకు కోదండరాం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read : కేసీఆర్ ‘ముందస్తు’ సంకేతాలు