దేశవ్యాప్తంగా చక్రం తిప్పుతా… భూకంపం పుట్టిస్తా…. గుణాత్మక మార్పు కోసం కృషి చేస్తా అంటూ చర్వితచరణంలా ప్రకటిస్తూ ఉండే టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు… ఎక్కడో బెడిసికొట్టినట్టే కనిపిస్తోంది. అందుకే మరో విధంగా పావులు కదుపుతున్నట్టు.. ఎవో కొత్త రకం ఎత్తులు వేస్తున్నట్టు తన మాటలు, చేతలు చూస్తే అర్థమవుతోంది. తాజాగా జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ సాగిన విధానం, కేసీఆర్ మాటలు చూస్తే… ఈ విషయం స్పష్టమవుతోంది. ఇప్పటిదాకా చేసింది వర్కవుట్ కాలేదు… ఇంకేదో చేస్తానంటూ కేసీఆర్ సంకేతాలిచ్చారు. దేశంలో మార్పు తీసుకొస్తానంటూ కేసీఆర్ రచించిన వ్యూహాల్లోనే మార్పు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిదా అని ఆలోచిస్తే… కొన్ని విషయాలు బోధపడుతాయి.
ఏకం చేస్తానన్నారు… ఏమైంది..?
దేశవ్యాప్తంగా పలు పార్టీల్ని కేసీఆర్ కూడగట్టేందుకు చేసిన ప్రయత్నం బోల్తా కొట్టినట్టు స్పష్టమైపోయింది. భావసారూప్యత కలిగిన పార్టీల్ని కలుపుకుని పోయే ప్రయత్నం ముందుకు సాగలేదు. దీంతో మరో కార్యాచరణపై దృష్టి సారించారు. తమిళనాడు, బెంగాల్, కేరళ ముఖ్యమంత్రులు స్టాలిన్, మమత బెనర్జీ, పినరయి విజయన్ తో కేసీఆర్ చర్చలు జరిపారు. అంతేకాకుండా వామపక్ష పార్టీలు, సమాజ్ వాదీ పార్టీ పెద్దల్ని సైతం ఏకం చేయాలని కొంతకాలంగా కేసీఆర్ వరుస భేటీలతో దూకుడు ప్రదర్శించారు. కానీ దేశవ్యాప్తంగా కేసీఆర్ రాజకీయ వ్యవహారశైలి నమ్మశక్యంగా లేకపోవడంతో ఆయా పార్టీలు పునరాలోచనలో పడ్డాయి. బీజేపీతో అంటకాగే కేసీఆర్… హఠాత్తుగా ఇలా ఎందుకు చేస్తున్నారు… ఇందులో ఏదైనా మతలబు ఉందా అని అందరూ ఆలోచనలో పడ్డట్టు గమనించవచ్చు.
ఎవరు నమ్ముతారు… ఎందుకు నమ్ముతారు..?
కేసీఆర్ ఏకం చేయాలని ప్రయత్నిస్తున్న పార్టీలు బీజేపీని గద్దె దింపాలన్న భావసారూప్యత కలిగిన పార్టీలే. కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ కూటమి సాధ్యం కాదనే విషయం నిర్వివాదాంశం. ఇటీవల డీఎంకే అధినేత స్టాలిన్… ఢిల్లీలో ఆఫీస్ ఓపెనింగ్ కు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఆహ్వానించారు. ఆమె వెళ్లి ఆఫీస్ ఓపెన్ చేయడంతో కేసీఆర్ ఖంగుతిన్నారు. తాను భేటీ అయి వారం గడవకముందే స్టాలిన్… కాంగ్రెస్ కు సన్నిహితంగా మెలగడంతో కేసీఆర్ కు మింగుడుపడలేదు. కేసీఆర్ విచిత్ర ధోరణి ఎలా ఉంటుందో.. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్ వచ్చి… కేసీఆర్ తో భేటీ అయ్యారు. కొన్ని రోజులకు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. యూపీలో బీజేపీ గెలవబోతోందని చెప్పారు. కానీ అప్పుడు పరిస్థితులు ఏకపక్షంగా ఏమీ లేవు. ఎస్పీ, బీజేపీ మధ్య హోరాహోరీ నడిచింది. అటువంటి సమయంలో మాట వరసకైనా మిత్రపక్షం గెలుస్తుందని అనని లీడర్, గెలవాలని కోరుకోని లీడర్ కేసీఆర్. అలాంటి వ్యక్తిని ఎవరు నమ్ముతారు…? దేశవ్యాప్తంగా తనను ఎవరూ నమ్మకపోవడం, తెలంగాణలోనూ పరిస్థితులు అంత సవ్యంగా ఏమీ లేకపోవడంతో కేసీఆర్ కు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. తన ఢిల్లీ కథ కంచికి పోయిందని గమనించారు.
కల చెదిరింది… కిం కర్తవ్యం..?
ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దలు చెబుతారు. అలాగే తెలంగాణలో కేసీఆర్ గెలిస్తేనే కదా… దేశవ్యాప్తంగా ఎవరైనా కనీసం అపాయింట్ మెంట్ ఇచ్చేది. కానీ తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. గెలిచే పరిస్థితి అస్సలు కనబడట్లేదు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే అని.. ఇటీవల ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంగీకరించారు. అయితే.. దేశవ్యాప్తంగా బీజేపీపై ఉన్న వ్యతిరేకతతో పోల్చితే తక్కువేనని సర్ది చెప్పుకున్నారు. గుడ్డిలో మెల్ల.. ఏదైతేనేం… మళ్లొచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలవడం అసాధ్యమని.. ప్రజల నాడిని బట్టి అర్థమవుతోంది. మరి.. రాష్ట్రంలో కుమారుడు కేటీఆర్ ను సీఎం చేయాలన్న కేసీఆర్ కలలు నిజమయ్యే పరిస్థితులు అస్సలు కనిపించడం లేదు. మరి ఇప్పుడెలా…? కింకర్తవ్యం….? అంటూ కేసీఆర్ ఆలోచనలో పడ్డట్టు కనిపిస్తోంది.
థర్డ్ ఫ్రంట్.. ఇప్పుడు అదొక థియరీ మాత్రమే
దేశంలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి అనే సిద్ధాంతం కేవలం థియరీకే పరిమితం. వాస్తవరూపం దాల్చడం కష్టమే. కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ కూటమి అసాధ్యం. అందుకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలుద్దామని కేసీఆర్ ఊబలాటపడుతున్నా…. కాంగ్రెస్ దరిదాపుల్లోకి రానివ్వడం లేదు. “దున్నేటప్పుడు దేశాల మీదకు పోయి… కోసేటప్పుడు కొడవలి పట్టుకుని వచ్చినట్టు”… కేసీఆర్ వ్యవహారం ఉందని అని కాంగ్రెస్ అధిష్ఠానం అర్థం చేసుకుంది. ఏడేళ్ల పాటు బీజేపీతో అంటకాగి, ప్రజా వ్యతిరేక విధానాలకు వంతపాడి, ఢిల్లీ వేదికగా రైతులు ఉద్యమిస్తుంటే కనీసం సంఘీభావం తెలపని కేసీఆర్…. బీజేపీతో యుద్ధం చేయగల సిపాయిని నేనే అంటే ఎవరు నమ్ముతారు…? ఇప్పుడు రైతులకు మేలు చేయగల స్కీములు తానే తీసుకొస్తానంటే… ఎందుకు నమ్ముతారు..?
ఇన్నాళ్లు ఏం చేశారో తెలియదా..?
వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఎంఐఎంను రంగంలోకి దింపి… కాంగ్రెస్, యూపీఏ మిత్రపక్షాల ఓట్లు చీల్చి, బీజేపీ గెలుపు కోసం కృషి చేసింది కేసీఆర్ కాదా…? అంతే కాదు.. దేశవ్యాప్తంగా కూటమి కట్టే ప్రయత్నంలో.. కేసీఆర్ మరో జిమ్మిక్కు చేస్తున్నారు. కేవలం యూపీఏ మిత్రపక్షాల్ని మాత్రమే కలుస్తున్నారు. అది కూడా ప్రతిపక్షంలో పక్షాల్ని కాదు. కేవలం అధికారంలో ఉన్న యూపీఏ మిత్రపక్షాల నేతలతోనే చర్చలు జరుపుతున్నారు. అంటే.. ఈ వ్యవహారమంతా.. బలంగా ఉన్న యూపీఏ మిత్రపక్షాల్ని కాంగ్రెస్ కు దూరం చేయడం కాదా…? బీజేపీ గెలుపునకు పరోక్షంగా సహకరించడం కాదా…? ఈ విషయం తెలిసిన కాంగ్రెస్…. ఇప్పుడు టీఆర్ఎస్ ను ఎందుకు కలుపుకుని పోతుంది…? ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ ను కూటమిలో చేర్చుకోవడం అంటే… పిల్లిని చంకన పెట్టుకుని పెళ్లికి పోయినట్టే అనే విషయం అర్థం చేసుకోలేని స్థితిలో కాంగ్రెస్ ఉందా..? లేదు. ముమ్మాటికీ లేదు.
ఒక పీకే… కొన్ని నిజాలు
కొంతకాలంగా కాంగ్రెస్ లో చేరుతానంటూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆ పార్టీ అధిష్ఠానం పెద్దలతో చర్చలు జరిపారు. చర్చల సందర్భంగా కాంగ్రెస్ పెద్దలు షరతులు పెట్టారు. వివిధ రాష్ట్రాల్లో తమ ప్రత్యర్థుల గెలుపు కోసం పని చేస్తూ…. తమ పార్టీలో చేరతానని అనడం సబబు కాదని తెలిపారు. ఐప్యాక్ కార్యకలాపాలు వదులుకుంటే… కాంగ్రెస్ లో చేర్చుకుని, సముచిత స్థానం కల్పిస్తామని ప్రతిపాదించారు. పీకే రేపోమాపో కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం జరిగింది. కానీ.. ఇటీవల కేసీఆర్ పీకేను పిలిపించుకుని ప్రగతి భవన్ వేదికగా రెండు రోజుల పాటు చర్చలు జరిపారు. ఏం వ్యూహం రచించారో… ఏం డీల్ కుదిరిందో గానీ…. కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు పీకే ప్రకటించారు.
తెరవెనుక శక్తులెవరు..?
పీకే ప్రకటనను ఆశామాషీగా చూడకూడదు. రాజకీయ కుట్రగానో, కుటిల బుద్ధితో తీసుకున్న నిర్ణయంగానో చూడకతప్పదు. ఎవరి ప్రోద్బలంతోనో జరిగినట్టు, తెరవెనుక ఎవరో ఉన్నట్టు గ్రహించాలి. అది ముమ్మాటికీ కేసీఆరే అని వరుస పరిణామాలు చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆ వెనుక బీజేపీ పెద్దలెవరైనా ఉన్నారేమో అనే సందేహాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. మరి పీకేను కాంగ్రెస్ లో చేరనియ్యకపోతే కేసీఆర్ కు కలిగే లాభమేంటి…? కాంగ్రెస్ లో చేరొద్దన్న కేసీఆర్ మాట వింటే పీకేకు ఒరిగేదేంటి…? కేసీఆర్ మాటను నమ్మేంత అమాయకుడా… పీకే…? పీకే లేకపోతే ఎత్తులు వేయలేని వ్యూహకర్తనా కేసీఆర్…? కాదు… ఇంకేదో కథ ఉంది. ఇద్దరూ వ్యూహకర్తలే… కానీ ఎవరి గెలుపు కోసం… ఎవరి మేలు కోసం… ఎవరు పని చేస్తున్నారనేదే ప్రశ్న.
మళ్లీ ముందస్తే….. ఎందుకంటే..!
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను గెలిపించి… కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక అప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీయేత పార్టీలతో కూటమి కోసం పీకే సాయంతో కృషి చేయవచ్చు. వర్కవుట్ అయితే అవుతుంది. లేదంటే లేదు. బీజేపీ చతికిలపడి, కాంగ్రెస్ అధిక స్థానాలు గెల్చుకుంటే… ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పంచన చేరొచ్చని కేసీఆర్ భావనగా గమనించవచ్చు. అప్పుడు బీజేపీ, కాంగ్రెసేతల పార్టీల జట్టుకు లీడర్లుగా ఉంటే.. కేసీఆర్, పీకేకు జాతీయ స్థాయిలో మంచి ప్రాధాన్యత లభిస్తుందని అంచనా వేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇదే విషయం చెప్పి… పీకేను ఒప్పించినట్టు అర్థం చేసుకోవచ్చు.
ఎటు గాలి వీస్తే అటు.. అదే కదా నైజం
టీఆర్ఎస్ ప్లీనరీలోనూ పలువురు నేతలు జాతీయ ఆశయాల గురించి ప్రస్తావించారు. కవితను జాతీయ వ్యవహారాల ఇంఛార్జిగానూ ప్రకటించారు. మరి ఇదంతా వర్కవుట్ కాకుంటే ఎలా..? యూపీఏ మిత్రపక్షాల ఓట్లు చీల్చడం ద్వారా మళ్లీ కేంద్రంలో బీజేపీ గెలిస్తే ఎలా…? ఏముంది.. తమ సుధీర్ఘకాల మిత్రపక్షం గెలిచిందని సంబరపడిపోయి.. వాళ్ల పక్షాన చేరుతారు… కేసీఆర్. ఏమో మరి… కేసీఆర్, పీకే జిమ్మిక్కులు కూడా అందుకేనేమో..! ఎవరి సిద్ధాంతాల వెనుక ఎవరి ప్రయోజనాలు దాకి ఉన్నాయో ఎవరికి తెలుసు. కానీ… నిరుద్యోగం, రైతుల కష్టాలు, ధరల పెరుగుదల, కుటుంబ పాలన, శాంతిభద్రతల వైఫల్యం, పన్నులమోత, నియంతృత్వ పోకడలతో సామాన్యుడి బ్రతుకు దుర్భరమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సారి దేశం, రాష్ట్రం డిసైడైంది. ఏం తీర్పు ఇవ్వాలో… సగటు ఓటరుకు క్లారిటీ వచ్చింది. కేసీఆర్ స్టోరీ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్ లో రానున్న పీకే కథా చిత్రం… అట్టర్ ప్లాప్ కావడం ఖాయంగానే కనిపిస్తోంది.