కాలం కలిసిరాకపోతే అరటిపండు తిన్న పన్ను విరుగుతుందని అంటుంటారు పెద్దలు. సరిగ్గా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే పరిస్థితిలో ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తో చెలిమి కారణంగా ఏడేండ్లుగా తెలంగాణను నిలువు దోపిడీ చేసిన కల్వకుంట్ల కుటుంబం బీజేపీ అధికార దాహానికి గద్దకు చిక్కిన కోడిపిల్లాలా ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ ను బలహీనం చేయాలనే వ్యూహంలో భాగంగా పరోక్షంగా బీజేపీకి బలం పెంచే ప్రయత్నం చేసిన టీఆరెస్ అధినేత రూపొందించిన వ్యూహాలే తన రాజకీయ ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారాయి. అసలు తెలంగాణలో బీజేపీ ఉందా ..? లేదా అనే స్థాయిలోనున్న పార్టీకి వలసలు పెంచి ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి ఈ రాష్ట్రంపై ఆశలు రేగేలా చేసింది కేసీఆర్ అనేది అందరికీ తెలిసిన విషయం. వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లుగా తన నిర్ణయాలే పార్టీ కొంపముంచేలా మారాయి.
నిత్యావసర ధరల పెంపు, జీఎస్టీ, కార్పోరేట్ శక్తుల అనుకూల నిర్ణయాలు వంటి అంశాలు 2024ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు వచ్చేలా చేయడం ఖాయం. ఇన్నాళ్ళు బీజేపీని ఆదరించిన ఉత్తరాది రాష్ట్రాలు మోడీ తీసుకున్న నిర్ణయాల కారణంగా మరోసారి ఆయన నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితుల్లో లేవన్నది సుస్పష్టం. ఫలితంగా ఉత్తరాదినా ప్రాంతీయ పార్టీలతోపాటు కాంగ్రెస్ గాలి వీస్తోంది. పైగా ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్ గొడుగు కిందకు వస్తుండటంతో మోడీ – షా ల ద్వయానికి ఓటమి భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాదిన బీజేపీకి తక్కువ స్థానాలు వస్తే ఏం చేయాలని సమాలోచనలు జరిపిన బీజేపీ అధినాయకత్వం ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకొని సీట్ల స్థానాలను మెరుగుపర్చుకోవాలని చూస్తున్నది. ఇందులో భాగంగానే ముఖ్యంగా తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం చేసిన అక్రమాలు బీజేపీకి తెలంగాణలో అధికార కాంక్ష రేగెందుకు కారణం అయ్యాయి. గులాబీ అధినేత కాస్త తోక జాడిచిన తోక కత్తిరించేందుకు బీజేపీ మిత్రపక్షాలు ఈడీ, సీబీఐలు కాచుకుచ్చున్నాయి. వీటిని అడ్డు పెట్టుకొని తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేయాలని కమలనాథులు గోతికాడి నక్కలా ఎదురుచూస్తున్నారు.
కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయల్లో జరిగిన అక్రమాలు ఒక ఎత్తైతే ఇటీవలి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసీఆర్ ను బీజేపీకి హ్యండ్సప్ చెప్పేలా చేసింది. కాళేశ్వరం నిర్మాణంతో భారీ అవినీతికి పాల్పడిన కల్వకుంట్ల కుటుంబం కమిషన్ల బండారాన్ని విచారణ సంస్థలు బయటపెడితే అధికారులనో ఇక పరిస్థితులు ఇబ్బందికరంగా మారితేనో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగానున్న హరీష్ రావును ఇరికించి ఈ అవినీతి ఊబి నుంచి బయటపడాలని ప్రగతి భవన్ లో ముందస్తు ప్రణాళికలు కూడా రెడీ చేసుకొని ఉంచుకున్నారు. కాని ఇటీవలి ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ , మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సాలు ఆరోపించారు. ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ దూకుడు కొనసాగిస్తోంది. కవిత సన్నిహితులు, కవిత భర్తతో బిజినెస్ కొనసాగించిన వెన్నమనేని శ్రీనివాస్ రావును ఈడీ విచారణకు పిలిచింది. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో విస్తృత సోదాలు కూడా చేసింది. ఇక, రేపో, మాపో కవిత కూడా విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటిసులు ఇవ్వడం ఖాయమని జోరుగా ప్రచారం జరిగింది. కవిత సన్నిహితుల నివాసంలో సోదాలు జరుపుతున్న ఈడీ , స్వయంగా కమలం పార్టీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే లిక్కర్ స్కాంతో కవితకు సంబంధం ఉందని చెప్పాక కూడా బీజేపీ డైరక్షన్ లో పని చేసే ఈడీ అధికారులు కేసీఆర్ కూతురిని మాత్రం ఎందుకు విచారణకు పిలవడం లేదన్నది కీలకమైన ప్రశ్న. కేసీఆర్ ను లొంగదీసుకొని తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే వ్యూహంలో భాగంగా జరుగుతున్నదే ఇదంతా.
మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ కావాలని తీసుకొచ్చిందే. అందులో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణలో పార్టీ బలనిరూపణకు ఇదో చక్కని అవకాశంగా వినియోగించుకొని మునుగోడులో గెలిచి అధికార టీఆర్ఎస్ నుంచి వలసలను ప్రోత్సహించాలని అమిత్ షా భావిస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోటలో హస్తం పార్టీ గెలిస్తే బీజేపీ – టీఆర్ఎస్ లకు పెద్ద దెబ్బే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మునుగోడులో బీజేపీ గెలుపునకు సహకరించాలని తన దూతలను అమిత్ షా ప్రగతి భవన్ కు పంపించారు. కాదు.. కుదరదంటే మీ కుటుంబం ఎలాంటి చిక్కుల్లో పడుతుందో అంటూ స్పష్టంగా కేసీఆర్ కు షా దూతలు నివేదించారు. ఈ క్రమంలోనే తన రాజకీయ జీవితం, కొడుకు, కూతుర్ల భవిష్యత్ రాజకీయాల కోసం మునుగోడు ఉప ఎన్నికల్లో రహస్యంగా బీజేపీ గెలుపునకు సహకరించేలా వ్యవహరిస్తామని కేసీఆర్ చెప్పడంతోనే కవిత కు అందాల్సిన ఈడీ నోటీసులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కేసీఆర్ తో జరిగిన ఒప్పందంలో భాగంగానే విచారణ సంస్థలు టీఆర్ఎస్ నేతలను కదిలించడం లేదు. ఈ చర్చను జనాల్లో లేకుండా చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నోటిసులు అంటూ తప్పుడు ప్రచారానికి తెరతీశారు.
తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం నానాటికీ మారుతున్న నేపథ్యంలో కొత్త పల్లవి అందుకున్నాడు కేసీఆర్. తెలంగాణను బంగారు తున్క చేశానని ఇప్పుడు భారత్ ను బంగారు భారత్ గా చేయాల్సి ఉందంటూ కొత్త నాటకానికి తెరలేపిండు. మోడీ గుజరాత్ మోడల్ అంటూ 2014లో దేశ ప్రజలకు కుచ్చుటోపీ పెడితే, దొరగారేమో తెలంగాణ మోడల్ అంటూ పంగనామాలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా మోడీపై వ్యక్తిగత విమర్శలు చేసి ఆయన ఆగ్రహానికి కేసీఆర్ కారణం అయ్యాడు. వ్యక్తిగత విమర్శలు చేస్తే అస్సలు సహించని మోడీ తెలంగాణ సీఎంను టార్గెట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అందివచ్చిన అవకాశంగా లిక్కర్ స్కాం బయపడింది. దీనిని ముందుంచి కేసీఆర్ నుంచి తెలంగాణ పగ్గాలు అందుకోవాలని బీజేపీ యోచిస్తున్నది. అధికారం కోసం అవినీతి మరకలను కూడా శుభ్రపరిచే బీజేపీ అవకాశవాద రాజకీయాలను పసిగట్టలేక కేసీఆర్ తన కుటుంబ అవసరాల దృష్ట్యా తెలంగాణలో మతతత్వ పార్టీ భవితవ్యానికి పునాదులు తవ్వుతున్నాడు. బీజేపీ – టీఆరెస్ కుట్రలను తెలంగాణ సమాజం తెలుసుకోవాల్సిన అవసరమున్నది. ఈ కుట్రలను చేదించి టీఆరెస్, బీజేపీలకు బుద్ది చెప్పాలి.