దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏదీ కలిసి రావడం లేదు. తన నేతృత్వంలో ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫ్రంట్ ఏర్పాటు చేయాలని యోచించిన కేసీఆర్ కు అన్ని చోట్ల ఆశాభంగమే ఎదురు అవుతుండటం టీఆరెస్ పార్టీ నేతలను సైతం కలవరపరుస్తోంది. దసరా తరువాత జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటన ఉంటుందని.. ఆ తరువాత ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫ్రంట్ ఏర్పాటుపై కీలక ప్రకటన చేస్తారని టీఆరెస్ నేతలే చెప్పారు. కాని , కేసీఆర్ రాజకీయాలను ఓ కంట గమనిస్తోన్న ప్రాంతీయ పార్టీల అధినేతలు టీఆరెస్ అధినేతతో చెలిమిని అసలే ఇష్టపడటంలేదు. అందితే జుట్టు అందక పొతే కాళ్ళు అనే రాజకీయ అవకాశవాదానికి పరాకాష్టగా నిలిచే కేసీఆర్ తో ఫ్రంట్ ఏర్పాటు చేస్తే రాజకీయంగా ఆగం అవ్వడం తప్ప పెద్దగా ఫలితం ఉండదని..పైగా ఫ్రంట్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించే కేసీఆర్ కు బీజేపీ నుంచి రాజకీయంగా ఏదైనా మంచి ఆఫర్ వస్తే తమను బలి పశువులను చేయడం ఖాయమని ఆయనతో భేటీ అయిన నేతలు ఆఫ్ ది రికార్డ్ చెప్పుకుంటున్నారట.
ఇటీవలే బీహార్ సీఎం నితీష్ కుమార్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలపై చర్చించారు. కొత్త ఫ్రంట్ పై కూడా వీరి భేటీలో చర్చకు వచ్చింది. బీహార్ సీఎంతో భేటీ చాలా సానుకూల వాతావరణంలో జరిగిందని.. తామంతా ఐక్యంతో కొత్త రాజకీయ ఎజెండాను రూపొందిస్తామని కేసీఆర్ ప్రెస్ మీట్ లో ప్రకటించారు. కేసీఆర్ తో భేటీ అయి నెల రోజులు కూడా గడవకముందే బీహార్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమైయ్యారు. బీజేపీని గద్దె దించాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని, తామంతా కాంగ్రెస్ తోనే ఉంటామని కేసీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చారు. బీహార్ సీఎం చేసిన ఈ ప్రకటన టీఆరెస్ వర్గాలకు మింగుడు పడటం లేదు. తమతో కలిసి వస్తారని ఆశించిన నితీష్ కుమార్ కాంగ్రెస్ కు జై కొట్టడంతో టీఆరెస్ నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది.
గత కొద్ది కాలంగా జాతీయ రాజకీయాలంటూ పలవరిస్తోన్న కేసీఆర్ వరుసగా ప్రాంతీయ పార్టీల అధినేతలను కలుస్తున్నారు. కొత్త ఫ్రంట్ అంటూ వారితో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. కేసీఆర్ రాజకీయాల పట్ల ఖచ్చితమైన అభిప్రాయం కల్గిన నేతలంతా ఆయనతో పొలిటికల్ ఫ్రెండ్ షిప్ ను నిరాకరిస్తున్నారు. పైగా, గత లోక్ సభ ఎన్నికల సమయంలో జాతీయ రాజకీయాలంటూ హడావిడి చేసి మధ్యలోనే కాడి వదిలేసిన కేసీఆర్ ఆ తరువాత బీజేపీకి అనుకూలంగా టర్న్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు సమాయత్తం అవుతోన్న నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకు కేసీఆర్ ఈ విధమైన రాజకీయ ఒరవడిని కొనసాగిస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీంతోనే కేసీఆర్ ను ఎవరూ విశ్వసించడం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రయాణంలో ఏదీ కలిసి రాకపోతే ఆయన బీజేపీకి మళ్ళీ జిందాబాద్ లు కొట్టడం లాంచనమేనని అంటున్నారు. తన ఆస్తుల కోసం, కేటీఆర్ భవిష్యత్ రాజకీయాల కోసం బీజేపీకి కేసీఆర్ సరెండర్ కావడం తథ్యమేనని చెప్పుకొస్తున్నారు.