కాంగ్రెస్ రహిత కూటమి కోసం పాట్లు
సాధ్యం కాదంటున్న రాజకీయ ప్రముఖులు
కొండంత రాగం తీసినా.. వృథా ప్రయాసే !
బీజేపీని ఢీకొట్టాలంటే.. కాంగ్రెస్ తోనే సాధ్యం
ముఖ్యమంత్రి కేసీఆర్ కి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కోరిక ఎక్కువైనట్లుంది. అందుకే జాతీయ స్థాయిలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఆయన అడుగులకి మడుగులొత్తే ఆస్థాన మీడియా.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు చేసి నరేంద్ర మోడీని బలంగా ఢీకొట్టాలనేది కేసీఆర్ సంకల్పమని కథనాల మీద కథనాలు వండి వారుస్తోంది. 2018 రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ముగిసిన వెంటనే కేసీఆర్ జాతీయ రాగం అందుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ రహిత కూటమి ఏర్పాటు అంటూ పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లారు. మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ తో మంతనాలు జరిపారు. ఇళ్లు వెతుక్కుంటూ వచ్చిన కేసీఆర్ అండ్ బృందానికి మంచి అతిథి మర్యాదలు చేసిన మమతా, నవనీన్ లు.. ఆ తర్వాత కూటమి ప్రణాళికను మాత్రం పట్టించుకోలేదు.
జాతీయ రాజకీయాలపై కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న కేసీఆర్, మళ్లీ ఇప్పుడు ఎన్నికలకు ముందు మరోసారి జాతీయ స్థాయిలో హడావుడి చేసేందుకు సిద్ధమయ్యారు. మొన్నామధ్య జార్ఖండ్ వెళ్లి సీనియర్ పొలిటీషియన్ శిబుసోరెన్, ఆ రాష్ట్ర సీఎం హోమంత్ సోరెన్ తో భేటీ అయ్యారు. జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీల ఐక్యతపై చర్చలు జరిపారు. ఇప్పుడు పంజాబ్ కు వెళ్లి రైతు ఉద్యమంలో అమరులైన అన్నదాతల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. పనిలో పనిగా పంజాబ్, ఢిల్లీ సీఎంలతో చర్చలు జరిపారు. ఆరగాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు అండగా ఎవరూ నిలిచినా సమర్థించాల్సిందే. కానీ కేసీఆర్ ముందు, తెలంగాణ రైతుల కన్నీళ్లు తుడిస్తే బాగుండేది !
జాతీయ పర్యటన షెడ్యూల్ లో భాగంగా.. కేసీఆర్ నిన్న కర్ణాటక వెళ్లారు. మాజీ ప్రధాని దేవె గౌడ, జేడీఎస్ అధ్యక్షుడు కుమార స్వామితో చర్చలు జరిపారు. టీఆర్ఎస్ వర్గాల చెబుతున్న దాని ప్రకారం… కేసీఆర్ జాతీయ పర్యటన ప్రధాన అజెండా.. దేశంలో నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో పాటు భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్రపతి – ఉప రాష్ట్రపతి ఎన్నికలు. ఈ అంశాల్లో కాంగ్రెస్ సహాయం లేకుండా జాతీయ స్థాయిలో మోడీ అండ్ అమిత్ షాని ఎదుర్కోవడం సాధ్యమేనా ? అసలు బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ రహిత కూటమి రూపుదాల్చగలదా ? అంటే… అసాధ్యమనే అనే చెప్పాలి. కేసీఆర్ ఇప్పటి వరకు కలిసిన మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాక్రే, అఖిలేష్ యాదవ్, శిబూ సోరెన్, దేవ గౌడ్ లకూ ఈ విషయం తెలుసు. కాకాపోతే.. ఇంటికి వచ్చి కలిసి వెళ్తా అన్న అతిథిని ఎవరూ మాత్రం రావద్దని అంటారు ??
సీఎం కేసీఆర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మహారాష్ట్రకు వెళ్లి సీఎం ఉద్ధవ్ థాక్రేతో భేటీ అయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల పోరాటంలో కలిసి రావాలని కోరారు. థాక్రే సరే అన్నారు. పర్యటన ముగించిన కేసీఆర్ తెలంగాణ చేరుకున్న తెల్లారే.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ కూటమి సాధ్యం కాదని శివసేని ప్రకటించింది. సీనియర్ నాయకుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ ని విస్మరించి ముందుకెళ్లడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. మొదట్లో కాంగ్రెస్ తో అంటీ ముట్టనట్లు వ్యవహరించిన మమతా బెనర్జీ కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ తో కలిసి సాగడం తప్పదన్న సంకేతాలు ఇస్తున్నారు. కర్ణాటకలో పరిస్థితులు ఎలా ఉన్నా, జేడీఎస్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ జట్టులోనే ఉంటుంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఉద్ధండులే కాంగ్రెస్ తో చెలిమికే ఓటు వేస్తుంటే… కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ రహిత కూటమి అంటూ వారి ముందు రాగం తీయడం వృథా ప్రయాసే !!
జాతీయ స్థాయిలో కేసీఆర్ కలుస్తున్న నేతలంతా.. తెలంగాణ ముఖ్యమంత్రిని పూర్తిగా విశ్వసిస్తున్నారా లేదా అన్నది సందేహమే ? ఎందుకంటే.. రాజకీయాల్లో కేసీఆర్ అనిశ్చితికి పెట్టింది పేరు. ఆయన ఎప్పుడు ఏ వైపు ఉంటారో, ఏ అవసరానికి ఎవరితో జట్టు కడతారో తెలియని అయోమయం. బీజేపీకి వ్యతిరేకంగా బయట పోరాటం అంటారు… వారు తెచ్చే బిల్లులకి పార్లమెంటులో మద్దతు ఇస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసిన నోట్ల రద్దుని కేసీఆర్ సమర్థించారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసి పంపాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్ ను కేసీఆర్ తోసిపుచ్చారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసే అధికారం రాష్ట్రాలకు లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ, కేంద్రం తీసుకొచ్చినవివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఎంఐఎం ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు అసెంబ్లీ తీర్మానం చేసి పంపించారు. ఇదీ కేసీఆర్ కి రైతులపై ఉన్న అసలైన ప్రేమ. ఇలా అనేక సందర్భాల్లో బీజేపీతో కేసీఆర్ ఢిల్లీలో దోస్తీ, తెలంగాణ గల్లీలో లడాయి అన్నట్లు వ్యవహరించారు. ఇక్కడ తిట్టడం, ఢిల్లీకి వెళ్లి రాజకీయాలు చేయడం. 8 ఏళ్లుగా ఇతే తంతు !!
ఇన్ని జిత్తులు వేసే కేసీఆర్ ని నమ్మేందుకు ఏ జాతీయ నాయకుడు సిద్దంగా లేరు. ఆయన్ని నమ్ముకుని ముందుకు సాగితే నట్టేట మునగడం ఖాయమని ఇప్పటికే ఆయా రాష్ట్రాల నేతలకు అర్థమైంది. అందుకే కలుస్తా అని వచ్చినప్పుడు మర్యాదలు చేసి పంపుతున్నారు. వచ్చి వెళ్లిన తర్వాత “కేసీఆర్ కో లైట్ లేలో” అంటున్నారట !!