తెలంగాణ ప్రగతికి కేంద్రం అడ్డం పడుతోందని అసెంబ్లీని సమావేశపరిచి లెక్కలతో సహా వివరిస్తామని ఆ మధ్య కేసీఆర్ ప్రకటించారు. డిసెంబర్ లో వారం రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ పోయి జనవరి వచ్చేసింది. కాని అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ముచ్చటే లేదు. జనవరిలోనూ అసెంబ్లీ నిర్వహించే అవకాశం లేదు. ఎందుకంటే సంక్రాంతి రానుంది. ఆ తరువాత జనవరి 26. ఆ తరువాత అసెంబ్లీ నిర్వహించాలనుకుంటే నిర్వహించొచ్చు. కాని కేసీఆర్ తాజాగా ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల అప్పులు కావాలని కేంద్రాన్ని కోరిన తెలంగాణ ప్రభుత్వం పట్ల కేంద్రం ఉదారభావంతో నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అడిగిన దాని కన్నా ఎక్కువ అప్పు పరిమితి మంజూరు చేసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రూ. 6,572 కోట్లు కావాలని కేంద్రానికి తెలంగాణ సర్కార్ ప్రతిపాదన పెట్టగా కేంద్రం మాత్రం ఏకంగా రూ. 9,572 కోట్లకు అనుమతులు ఇచ్చింది.
ఇంతకాలం అప్పులపై కొర్రీలు పెడుతూ వచ్చిన కేంద్రం సడెన్ గా తెలంగాణకు అడిగిన దానికంటే ఎక్కువ అప్పు ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలతోనే కేంద్రం వెనక్కి తగ్గిందా..? అనే అనుమానాలు కల్గుతున్నాయి.
అయితే , అప్పులకు కేంద్రం అనుమతి మంజూరు చేసినా, బడ్జెట్ ప్రతిపాదనలకు.. అప్పులకు మాత్రం చాలా వ్యత్యాసం ఉంది. రూ.53,970 కోట్ల రుణాలు తీసుకోవాలని బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొనగా.. కేంద్రం అనుమతి ఇచ్చింది మాత్రం రూ.39,450 కోట్లే. మిగతాది లోటులో పడిపోయింది. ఏదీ ఏమైనా కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం తెలంగాణకు ఊరటనిచ్చేదే.
అందుకే తాజాగా అసెంబ్లీని సమావేశపరిచి కేంద్రాన్ని నిందించడం కంటే.. ఒకేసారి బడ్జెట్ సమావేశాల్లో చెప్తే సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల తరువాత అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది కాబట్టి.. బడ్జెట్ సమావేశాల్లోనే అన్ని వివరాలను చెప్తే ఉపయోగం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read : ఇంతకీ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయా..? లేదా..?