ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందింది. టీడీపీ గెలిచే అవకాశమే లేదు. ఏడ్చినట్టుగా ఏడో స్థానానికి పోటీ పడుతుందని వైసీపీ సెటైర్లు వేసింది. కాని వైసీపీ ఎమ్మెల్యేలే పంచుమర్తి అనురాధ గెలుపుకు దోహదం చేశారు.
నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతోనే టీడీపీ అభ్యర్థి గెలిచారని వైసీపీ నిర్ధారణ చేసుకుంది. దాంతో వారిని క్రమశిక్షణ చర్యల కింద పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీలో నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలపై వేటు వేసింది.
ఇదంతా పార్టీ అంతర్గత వ్యవహారాల ప్రకారం జరిగింది. కాని పార్టీ నుంచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు చెల్లుతుందా..? అనేది ఇప్పుడు బిగ్ డిబేట్ గా మారింది. ఏ పార్టీలోనైనా వ్యవహారాలు కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జరగాలి. నా పార్టీలో అంత నా ఇష్టమున్నట్లు జరగుతుంది అంటే కుదరదు.
నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటుపై ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. నిబంధనల ప్రకారమే ఈ నలుగురిని వైసీపీ సస్పెండ్ చేసిందా..? లేదంటే ఆ ఎమ్మెల్యేలు చట్టపరంగా పోరాడితే వైసీపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు.
ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలంటే వారికి ముందు షోకాజ్ నోటీసు జారీచేయాలి. ఏ కారణంతో సదరు ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోబోతున్నారో పేర్కొనాలి. ఎమ్మెల్యే మీద ఉన్న ఆరోపణలు ఏమిటో వివరించి… సదరు ఎమ్మెల్యే వివరణ తీసుకోవాలి. ఇందుకోసం షోకాజ్ నోటీసు అందుకున్న దగ్గర నుండి వారం రోజులో లేకపోతే రెండు వారాల గడువు ఇవ్వాలి.
ఈ వ్యవహారమంతా పార్టీ క్రమశిక్షణ కమిటీ పేరుతో జరగాలి. ఎమ్మెల్యే ఇచ్చిన వివరణపై సంతృప్తి లేకపోతే అప్పుడు సస్పెన్షన్ విధించే అవకాశం ఉంటుంది. కానీ వైసీపీ సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేల విషయంలో వీటిని పక్కనపెట్టేశారు. దాంతో వారు తమ సస్పెన్షన్ చెల్లదని కోర్టును ఆశ్రయిస్తే వైసీపీకి మరో అనవసర ఎదురుదెబ్బ తగలడం ఖాయం.