బీఆర్ఎస్‌కు సినిమా చూపించిన రేవంత్‌రెడ్డి
మా దేవుడు నువ్వేనయ్యా అంటూ సినీ కార్మికులు సంబురాలు
బీఆర్ఎస్ వెన్నులో వణుకు మొదలైంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఆగం అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. తాజాగా తెలుగు సినీ కార్మికులతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార శైలి మారిపోయింది. ఒక్కో వర్గం క్రమంగా కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతుండటంతో వార్ వన్ సైడ్ అని అంతా ఫిక్సయ్యారు.
పదేళ్ల పాటూ సినీ రంగం కోసం ఇది చేశామంటూ చెప్పుకునేందుకు ఏ ఒక్క పనీ లేకపోవడంతో…బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. సినీ కార్మికుల సంక్షేమం కోసం సీఎం రేవంత్ ఇచ్చిన హామీలతో ఆ వర్గాల్లోనూ హర్షాతిరేకాలు మొదలయ్యాయి. రేపటి భవిష్యత్ కోసం ఆలోచించే విజన్ ఉన్న రేవంత్ రెడ్డి..రాజకీయాల కోసం కాకుండా మనసున్న మనిషిలా ఆలోచించారు. సినీ కార్మికుల పిల్లలకు ఉన్నత భవిష్యత్ అందించేందుకు 4 ఎకరాల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు చదువుకునేలా క్యాంపస్ ఏర్పాటు చేస్తామన్నారు.
అంతేకాదు సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం నుంచి 10 కోట్లు డిపాజిట్ చేయడంతో పాటూ టికెట్ల పెంపు కోసం వచ్చే నిర్మాతలు లాభాల్లో 20 శాతం ఆ నిధికి ఇవ్వాలని చెప్పారు. దీనిపై నిర్మాతల్లోనూ హర్షం వ్యక్తం అవుతున్నది. తమ సినిమా నిర్మాణంలో రెక్కలు ముక్కలు చేసుకునే కార్మికులకు ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు. గతప్రభుత్వాల మాదిరిగా కమిషన్లు కాకుండా…కార్మికుల సంక్షేమం కోసం ఆలోచించిన మనుసున్న ముఖ్యమంత్రి అంటూ కొనియాడుతున్నారు.
ఇక తెలుగు సినీ రంగం ఖ్యాతిని మరింత పెంచేందుకు పని చేస్తామని, హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తామని ఇచ్చిన హామీపై అన్ని వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతున్నది. గత సర్కారు కేవలం ఐటీ, ఫార్మా వంటి బడా కార్పొరేట్ వ్యక్తుల కోసం పనిచేసింది. కానీ ఇప్పుడు కోట్లాదిమందికి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న వేలాది సినీ కార్మికుల కోసం పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఉండటం తమ అదృష్టమని చెప్తున్నారు.
తెలంగాణ ఖ్యాతిని పెంచేందుకు, పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఇలాంటి చర్యలు ఆయన విజన్‌కు అద్దం పడుతున్నాయని పలువురు కొనియాడుతున్నారు. కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం సీఎం ఇలాంటి హామీలు ఇచ్చారని తప్పుడు ప్రచారంతో ఎప్పటిలాగానే బీఆర్ఎస్ నేతలు తమ ఏడుపు కొనసాగిస్తున్నారు. అయితే సినీ ఇండస్ట్రీ కేవలం ఒక్క నియోజకవర్గానికి పరిమితం కాదని తెలియకపోవడం వారి అజ్ఞానానికి నిదర్శనం.
