సబ్బండ వర్గాల పోరాటంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవానికి నేటితో తొమ్మిదేళ్ళు నిండాయి. ఉద్యమ లక్ష్యం నెరవేరింది కానీ ఉద్యమ ఆకాంక్షల కోసం స్వరాష్ట్రంలోనూ నినదించాల్సిన దుస్థితి కనిపిస్తోంది. తెలంగాణకు అభివృద్ధి అంటే ఏమిటో తెలియదని, కేసీఆర్ వచ్చాకే తెలంగాణకు అభివృద్ధి పరిచయమైందని బీఆర్ఎస్ నేతలు అతిగా ప్రచారం చేస్తున్నారు. అయితే.. కొన్ని విషయాల్లో బీఆర్ఎస్ సర్కార్ పురోగతి సాధించిన మాట వాస్తవమే కానీ కీలక అంశాల్లో మాత్రం ఫెయిల్ అయ్యారు.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు ఇచ్చారు. సాగునీటి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పుకున్నారు. కాళేశ్వరం ఒక అనర్థక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో లక్షన్నర కోట్ల రూపాయలు వ్యయం చేసి కమిషన్లు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన 33 ప్రాజెక్టులు పనులు పూర్తి కాక నిర్మాణ దశలోనే ఉన్నాయి. వాటిని మరో 8కోట్లు కేటాయిస్తే నిర్మాణమై..33లక్షల ఎకరాలకు సాగునీరు అందేది కానీ కేసీఆర్ అలా చేయలేదు.
ఇక, ఆకాశ హర్మ్యాలతో హైదరాబాద్ లుక్ మార్చేశారు. ఔరా అనిపించేలా ప్రపంచ నగరాల సరసన హైదరాబాద్ ను చేర్చారు. తొమ్మిదేళ్ళ హైదరాబాద్ కు ప్రస్తుత హైదరాబాద్ కు పోలికే లేదు. అనవసరంగా కూల్చి కట్టినప్పటికీ నూతన సచివాలయం టూరిస్ట్ ప్లేసుగా ఆకర్షిస్తోంది. శాంతి భద్రతలను కాపాడేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ను నిర్మించారు. ఉపాధి అవకాశాలను కాస్త పెరిగాయి. అప్పటికీ, ఇప్పటికీ తెలంగాణ అభివృద్ధిలో ప్రగతి సాధించిన మాట వాస్తవమే కానీ ఆశించిన మేర, ఆశించిన రంగంలో మాత్రం అభివృద్ధి చెందలేకపోయింది.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రవేశపెట్టిన హామీలను నెరవేర్చలేకపోయారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్, ఉద్యోగాల భర్తీ, కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య, మండలాల్లో వంద పడకల ఆసుపత్రి వంటి కీలక హామీలను విస్మరించారు. ఇకపోతే, ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అప్రజాస్వామిక విలువలు కనిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణలో ఉండాలి మిగతా పార్టీల అస్తిత్వం ఉండొద్దు అనే ఫ్యూడల్ వైఖరితో కేసీఆర్ రాజ్యం ఏలుతున్నారు. అందుకే ప్రత్యర్ధి పార్టీల్లో గెలుపొందిన నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో కాస్త మెరుగుపడినా ఇతర విషయాల్లో మాత్రం పాలనాధిపతి తీరును ప్రజలు ఆమోదించడం లేదు.