తెలంగాణ గవర్నర్ తమిళ సై చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటీవల నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ రిజెక్ట్ చేయడంతో మంత్రులు తమిళ సై పై తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె అందుకు కౌంటర్ గా తాజాగా మాటల తూటాలను పేల్చినట్లు స్పష్టం అవుతోంది.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించడంతో రాజ్ భవన్ లో గవర్నర్ తాజాగా కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రధానమంత్రి మోడీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సభలో తమిళ సై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
గవర్నర్ గా తాను బాధ్యతలు చేపట్టే నాటికి కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి లేరు. తాను వచ్చాక ఇద్దరు మహిళా మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించానని తమిళ సై గుర్తు చేశారు. మహిళలకు మంత్రులుగా అవకాశం రావడం.. తను వారితో ప్రమాణస్వీకారం చేయించడం సంతోషకరమని వ్యాఖ్యానించారు.
రాజకీయాలపై ఆసక్తితోనే వైద్య వృత్తిని వదిలేసినట్లు చెప్పారు తమిళ సై. తాను ఒకప్పుడు బీజేపీ నేతనే కానీ ఇప్పుడు కాదన్నారు. గవర్నర్ గా రాజకీయాలకు అతీతంగా స్పందిస్తానని తెలిపారు. తనకు ప్రభుత్వం ప్రోటోకాల్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పట్టించుకోనని తన పని తాను చేసుకుంటూ పోతానని స్పష్టం చేశారు.
అనంతరం పోయేటిక్ గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నాపై పువ్వులు వేసే వారు ఉన్నారు. రాళ్లు వేసే వారూ ఉన్నారు. నాపై రాళ్లు వేస్తే, వాటితో భవంతి కడతా. నాపై పిన్స్ వేస్తే, ఆ పిన్స్ గుచ్చుకుని వచ్చే రక్తంతో నా చరిత్ర బుక్ రాసుకుంటా. నాపై పువ్వులు వేసినా, రాళ్లు వేసినా ఆహ్వానిస్తా.. ఎలాంటి అవమానాలు ఎదురైనా ప్రజల కోసం పనిచేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read : కేసీఆర్ కు గవర్నర్ బిగ్ షాక్..!!