రైతులు సాగు పనులకి సిద్ధమవుతున్న వేళ.. భారత వాతావరణ విభాగం శుభవార్త చెప్పింది. ఈ సారి వర్షాకాలంలో కూడా దేశవ్యాప్తంగా మంచి వానలు పడతాయని, సాధారణ వర్షపాతానికి మించి నమోదవుతాయని తెలిపింది. ఈ మేరకు వర్షపాతంపై రెండో విడత అంచనాలను ఐఎండీ విడుదల చేసింది. రాబోయే నాలుగు నెలల్లో జూన్ నుండి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాల సగటు వర్షపాతం 103 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. అంతకముందు ఏప్రిల్ లో విడుదల చేసిన అంచనాల్లో వర్షపాతం సగటు 99 శాతంగా ఉంటుందని పేర్కొంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు గత 50 ఏళ్లలో కురిసిన వర్షాల సగటుతో సాధారణ వర్షపాతాన్ని లెక్కిస్తారు. దీన్నే సుదీర్ఘ కాల సగటు ( లాంగ్ పీరియడ్ యావరేజ్ – LPA ) అంటారు. దేశం మొత్తానికి ఎల్పీఏ 87 సెంటీమీటర్లని ఐఎండీ తెలిపింది.
వరుసగా నాలుగో ఏడాదీ దేశవ్యాప్తంగా సాధారణ వర్షాలే నమోదవుతాయన్న ఐఎండీ అంచనాలు … వ్యవసాయ రంగానికి ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్రాంతాల వారీగా చూస్తే.. గుజరాత్ నుంచి ఒడిశా వరకు ఉన్న ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. మధ్య, దక్షిణ భారత ప్రాంతాల్లో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని, నార్త్ ఈస్ట్ మరియు నార్త్ వెస్ట్ ప్రాంతాల్లో సాధారణ వానలు పడతాయని తెలిపింది. రానున్న సంవత్సరాల్లోను దేశవ్యాప్తంగా ఇవే పరిస్థితులు కొనసాగుతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహోపాత్ర స్పష్టం చేశారు. లోటు వర్షపాతం రోజులు పోయాయని, భవిష్యత్తులోనూ మంచి వర్షాలే చూస్తామని తెలిపారు.
మరోవైపు మే 29న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతున్నాయి. ఈ వారం చివరి నాటికి తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.