దళిత బంధు తరహాలోనే గిరిజన బంధు అమలు చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటన వెనక లొగొట్టు ఏంటి..? ఈ పథకం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడుతోనే కేసీఆర్ ప్రకటించారా..? రేవంత్ ను నిలువరించాలంటే గిరిజన బంధు అస్త్రాన్ని ప్రయోగించాలని కేసీఆర్ అండ్ కో భావించిందా..? ఈ పథకం రేవంత్ విజయమా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది.
మరో ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి మాత్రం టీఆరెస్ కు గెలుపు అంత ఈజీ కాదని అర్థమైపోయింది. 2018 ముందస్తు ఎన్నికల్లో రేవంత్ ను కొడంగల్ లో ప్రచారం నిర్వహించకుండా అరెస్టు చేసి, మొత్తం మంత్రివర్గం అంత అక్కడే మకాం వేసి లేనిపోని హామీలు ఇచ్చి రేవంత్ ను ఓడించారు కాని, ఈసారి మాత్రం రేవంత్ ను మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయడం కష్టమేనని కేసీఆర్ కు భయం పట్టుకుంది. పైగా, ప్రస్తుత ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కబ్జాల బాగోతం, అవినీతి ఆరోపణలు కూడా టీఆరెస్ ను చిక్కులో పడేస్తున్నాయి. కొడంగల్ కొదమ సింహాన్ని ఓడించి ఆ నియోజకవర్గం ఏం కోల్పోయిందో ఈపాటికే వారికీ అర్థమైంది. వచ్చే ఎన్నికల్లో కొడంగల్ లో రేవంత్ గెలిస్తే ఆయన్ని తట్టుకోవడం టీఆరెస్ కు కష్టమే. దీంతో ప్రశ్నించే గొంతుకను ఓడించేందుకు కేసీఆర్ తన మైండ్ కు పదును పెట్టారు.
రేవంత్ కు కొడంగల్ లో గిరిజన సామజిక వర్గం నుంచి మంచి ఆదరణ ఉందన్నది ఓపెన్ సీక్రెట్. ఇప్పటికే దళిత బంధుతో ఆ సామజిక వర్గం ఓట్లను డైవర్ట్ చేశామని సంబరపడుతున్న టీఆరెస్…ఇప్పుడు రేవంత్ ను ఓడించేందుకు గిరిజన బంధును అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది.
కొడంగల్ లో 10 శాతానికి పైగా ఓట్లు గిరిజన సామజిక వర్గానికి ఉన్నాయి. దాంతో రేవంత్ ను ఓడించాలంటే సామజిక వర్గాల వారీగా ఓట్లను కొనుగోళ్ళు చేసేందుకు ఏమేం చేయాలో చేసేందుకు కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, గిరిజన బంధు ప్రకటనపై కొడంగల్ లో టీఆరెస్ కు గట్టి షాక్ తగిలింది. ఇది రేవంత్ విజయంగా అభివర్ణిస్తూ గిరిజనులు టీపీసీసీ చీఫ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేసీఆర్ కు షాక్ ఇచ్చారు.