కొల్లాపూర్ లో తగ్గిన ప్రాధాన్యం
కార్యక్రమాలకూ పిలవకుండా అవమానం
ప్రాధాన్యం ఉన్నచోటికే వెళ్లాలని నిర్ణయం
జూన్ లో హస్తం గూటికి ?
ఆపరేషన్ ఆకర్ష్ తో ఓవర్ లోడ్ తో ప్రయాణిస్తోన్న కారు.. నెమ్మదిగా ఖాళీ అవుతోందా ? గులాబీ దళంలో అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారా ? కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని, వాపుని చూసి బలుపుగా భావిస్తోన్న టీఆర్ఎస్ కి త్వరలో షాక్ ల మీద షాక్ లు తగలనున్నాయా ? రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే.. ఈ ప్రశ్నలన్నింటికీ ఔననే సమాధానమే వస్తోంది. టీఆర్ఎస్ లో పాత, కొత్త నేతల మధ్య పొసగడం లేదని, కొత్తవారికి అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో.. కొంతమంది సీనియర్లు గుర్తింపు ఉన్నచోటికే వెళ్లేందుకే సిద్ధమవుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు… త్వరలోనే ఆ పార్టీని వీడి, తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అవుతున్నారని సమాచారం.
ఇప్పటి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జూపల్లి… 2018 లో కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీఆర్ఎస్ బీరంకి వలేసి.. తమ పార్టీలో చేర్చుకుంది. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో జూపల్లికి ప్రాధాన్యత తగ్గింది. అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానాలు కూడా అందకుండా అవమానాలు ఎదురవుతుండటంతో .. జూపల్లి, ఆయన అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే.. ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనవాస రెడ్డిలని జూపల్లి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఖమ్మం జిల్లా టీఅర్ఎస్ లోను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నీ తానై నడిపిస్తున్నారని, తుమ్మల, పొంగులేటికి ప్రాధాన్యం దక్కడం లేదన్న ప్రచారముంది. దీంతో సీనియర్ నేతలు భేటీ కావడం కొత్త ఊహాగానాలకు తెరతీసింది. ఎన్నికలకు ఇంకో ఏడాది మాత్రమే సమయం ఉన్న పరిస్థితిలో… టీఆర్ఎస్ లో కొనసాగితే భవిష్యత్తులో ఇంకా నష్టపోతామని జూపల్లి కృష్ణారావు భావిస్తున్నారట. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడయ్యాక .. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పునరుత్తేజమైంది. టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనేని ప్రజలకు కూడా భావిస్తున్నందున… తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు జూపల్లి కృష్ణారావు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే తన అనుచరులతో చర్చలు జరిపారని సమాచారం. మంచి ముహూర్తం చూసుకుని, మే నెల చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో జూపల్లి కృష్ణారావు హస్తం గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.