ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ – ధరణి పోర్టల్ రద్దు
రాహుల్ గాంధీ సాక్షిగా రైతు డిక్లరేషన్ ప్రకటన
365 రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్
భూమిలేని రైతులకి పెట్టుబడి సహాయం
పంట గిట్టుబాటు ధరల ప్రకటన
కేసీఆర్ వ్యవసాయాన్ని చిన్నాభిన్నం చేశారు
రైతు సంఘర్షణ సభలో రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో 365 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. ఆ వెంటనే రాష్ట్రంలో రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ ను రద్దు చేసి.. భూమి కలిగిన ప్రతి పేదవాడికి న్యాయం చేసేలా నూతన రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తామని అన్నారు. ఈ మేరకు వరంగల్ లో రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ వేదికగా ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ను ప్రకటించారు. రైతుని రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని.. రాహుల్ గాంధీతోనే అది సాధ్యమని నినదించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణతో ఉన్నది పేగుబంధం అని అభివర్ణించారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన కేసీఆర్… రాష్ట్రంలో 70 శాతం వ్యవసాయ కుటుంబాల జీవితాలను చిన్నాభిన్నం చేశారని.. వేలాది మంది రైతుల ఆత్మహత్యలకు కారుకుడయ్యాడని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ .. రైతుల పక్షాన సంపూర్ణమైన బాధ్యత తీసుకుంటుందని, రైతులని ఆదుకుంటుందని స్పష్టం చేశారు.
వరంగల్ రైతు డిక్లరేషన్ – వాగ్దానాలు
“కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 365 రోజుల్లో అధికారంలోకి వస్తుంది. ప్రజల ఆశీర్వాదంతో సోనియమ్మ రాజ్యం ఏర్పడుతుంది. ఆ వెంటనే ఏకకాలంలో రూ. 2 లక్షల రూపాయ రుణ మాఫీ చేస్తాం. ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి.. రైతులు, కౌలు రైతులకి ప్రతి ఎకరానికి ఏడాదికి రూ. 15 వేల పెట్టుబడి సహాయం అందిస్తాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో నమోదైన భూమిలేని పేద రైతులకి ఏటా రూ. 12 వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. తెలంగాణలో మూతపడిన చెరకు కర్మాగారాలను తెరిపిస్తాం. పసుపు బోర్డుని ఏర్పాటు చేస్తాం. రైతులపై భారం లేకుండా మెరుగైన పంటల బీమా పథకం తీసుకొచ్చి, ప్రకృతి విపత్తులు, మరొక కారణంతో నష్టపోయిన రైతుకి తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకుంటాం. రైతు కూలీలు, భూమిలేని రైతులకి రైతు బీమా అందిస్తాం. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం. పోడు భూముల్లో వ్యవసాయం చేస్తోన్న ఆదివాసీ బిడ్డలకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం. అసైన్డ్ భూముల్లో వ్యవసాయం చేస్తున్న దళిత సోదరులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తాం. రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ ను రద్దు చేస్తాం. సరికొత్త రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఖమ్మం, వరంగల్ జిలల్లాలో నకిలీ విత్తనాలు బెడద ఎక్కువగా ఉంది. వందలాది ఎకరాల్లో రైతులు పంట నష్టపోతున్నారు. ఈ నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటాం. వ్యక్తులు, సంస్థల మీద పీడీ యాక్ట్ నమోదు చేసి జైల్లో వేస్తాం. నిర్దిష్ట సమయ ప్రణాళికతో, అవినీతికి ఆస్కారం లేకుండా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి.. చివరి ఎకరా వరకు నీరు అందిస్తాం. రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం, చట్టపరమైన అధికారాలాతో రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం. తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన వ్యవసాయ విధానంతో వ్యవసాయాన్ని పండుగలా మారుస్తాం.
అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం. గిట్టుబాటు ధరల వివరాలను గ్రామాల్లో చిట్టచివర ఉన్న రైతుకీ చేరవేస్తాం. తెలంగాణలో ప్రధాన పంట వరి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వరి మద్దతు ధరకు 500 బోనస్ ఇచ్చి క్వింటాల్ కు రూ. 2,500 చెల్లిస్తాం ( ప్రస్తుతం రూ. 1960) . మొక్కజొన్నకు రూ. 2,200 ( ప్రస్తుతం రూ. 1870)..
కందులకు రూ.6,700 ( ప్రస్తుతం రూ 6,300).. పత్తికి రూ. 6,500 ( ప్రస్తుతం రూ. 6025 ) చెల్లిస్తాం. మిర్చి రూ. 15000… పసుపు రూ. 12,000… ఎర్ర జొన్న రూ.3,500… చెరకు రూ. 4,000… జొన్నలు రూ. 3050 గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తాం” అని రేవంత్ రెడ్డి రైతు డిక్లరేషన్ ను ప్రకటించారు.
కళ్లాల్లో వడ్ల రాశులపై గుండెలు పగిలి చనిపోతున్న రైతులకు భరోసా ఇవ్వడానికి భారతదేశ భావి ప్రధాని రాహుల్ గాంధీ వరంగల్ కు వచ్చారని రేవంత్ తెలిపారు. రాహుల్ గాంధీ సాక్షిగా, వరంగల్ రైతుల సాక్షిగా, సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిగా… రైతు సంక్షర్షణ సభలో.. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ ను ప్రకటిస్తోందని అన్నారు.