బీఆర్ఎస్ లో కేటీఆర్ ఒంటెత్తు పోకడలపై కార్యకర్తలే కాదు..కుటుంబ సభ్యులు కూడా అసహనంగా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నాడో..ఏం చేస్తున్నాడో తెలియకుండా గుడ్డి గుర్రం చేనులో పరిగెత్తినట్లు సాగుతున్న కేటీఆర్ వ్యవహారశైలిపై ఇప్పటికే గులాబీ పార్టీ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. పార్టీని నడిపించాల్సిన కేసీఆర్ ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యారు. తోడుగా ఉంటాడనుకున్న హరీష్ రావు కలిసి రావడం లేదు. తన వర్గం నేతలను కూడా అటువైపు వెళ్లనివ్వడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన మాజీ మంత్రులు తెలంగాణ భవన్ వైపు కన్నెత్తి చూడటం లేదు. కేటీఆర్ మాటల్లో అహంకారం, ఓ విజన్ లేకుండా సాగుతున్న విమర్శలతో గులాబీ క్యాడర్ ఒకరొక్కరుగా దూరమవుతున్నారు. తాజాగా ఆయన సోదరి కవిత కూడా కేటీఆర్ పై తిరుగుబావుటా ఎగురవేసినట్లు కనిపిస్తోంది. లిక్కర్ స్కాంలో బెయిల్ పై విడుదలై బయటకు వచ్చినప్పటి నుంచి కవిత పెద్దగా కనిపించలేదు. కొన్నాళ్లు ఫామ్ హౌజ్ లో ఉండిపోయారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కులగణనలో తాజాగా ఆమె పాల్గొన్నారు. ఎన్యుమరేటర్లకు పూర్తి వివరాలు ఇచ్చారు. ఒక వైపు తన అన్న కేటీఆర్ కులగణనపై అర్ధం పర్థం లేని ఆరోపణలు చేస్తుంటే..కవిత మాత్రం అందులోని మంచిని అర్ధం చేసుకొని సహకరించడంపై గులాబీ పార్టీలోని ఓ వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం చేసే ప్రతి పనిని గుడ్డిగా విమర్శించడం కాకుండా ప్రతిపక్షంగా ఉంటూ నిర్మాణాత్మక విమర్శలు చేయాలంటూ ఎన్నిసార్లు సలహా ఇచ్చినా కేటీఆర్ పట్టించుకోలేదని, అందులోని మంచిని ఇసుమంత కూడా అర్ధం చేసుకోకుండా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని గుర్రుగా ఉన్నారు.
ఇప్పటికే కేటీఆర్ చేస్తున్న కార్యక్రమాలకు హరీష్ రావు దూరంగా ఉంటున్నారు. ఆయన వర్గం నేతలు కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. వారిద్దరి మధ్య కుమ్ములాటల సంగతి ప్రతి ఒక్క కార్యకర్తకు తెలుసు. తాజాగా కవిత కూడా ఇలా పరోక్షంగా కేటీఆర్ విధానాలను వ్యతిరేకించడం ఆ పార్టీ నేతల్లో మరింత చర్చకు దారి తీసింది.