నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్ హాజరయ్యారు. గురువారం సుమారు ఐదు గంటలపాటు న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అధికారులు విచారించారు. యంగ్ ఇండియా కంపెనీకి విరాళాలు ఇచ్చిన విషయమై ఈడీ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలిసింది. విచారణ అనంతరం గాలి అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
ఈడీ అధికారులు కొన్ని పేపర్లపై సంతకాలు తీసుకున్నారన్నారు. అయితే, విరాళాల విషయంలోనే ఈ కేసు విచారణ నడుస్తుండటంతో తాను యంగ్ ఇండియాకు విరాళం ఇచ్చినట్లు ఈడీ అధికారులకు చెప్పినట్లు తెలిపారు. తాను ఈడీ అధికారులకు విచారణ సందర్భంగా పూర్తిగా సహకరించానని పేర్కొన్నారు. విచారణకు హాజరు కావాలని ఈడీ నుంచి పిలుపు వస్తే మళ్ళీ తప్పకుండా విచారణకు హాజరు అవుతానని చెప్పారు.
ఈ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందనేది ప్రధాన ఆరోపణ. నగదు లావాదేవీలే జరగనప్పుడు.. మనీ ల్యాండరింగ్ ఎలా జరుగుతుందనేది అందరి సందేహం. తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతుండటంతో రాష్ట్ర కాంగ్రెస్ లోని కీలక నేతలను రాజకీయంగా వేధించేందుకు కేంద్రం ఈడీని ఉసిగొల్పిందనే విమర్శలకు బలం చేకూరుతోంది. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ కీలక నేత, ఆర్ధికంగా పటిష్టంగా ఉన్న గాలి అనిల్ కుమార్ ను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. తాను చెక్కుల రూపంలోనే విరాళాలు ఇచ్చానని గాలి అనిల్ కుమార్ చెబుతున్నా .. మనీ ల్యాండరింగ్ పేరిట విచారణకు రావాలని ఆదేశించడంతో ఇది రాజకీయ ప్రేరేపిత విచారణగా అర్థం అవుతోంది. ఈ రాజకీయ కక్ష సాధింపు కేసును గాలి అనిల్ కుమార్ ఎలా అధిగమిస్తారో చూడాలి..?