నేషనల్ హెరాల్డ్ కేసులో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్ ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించడం వెనక టీఆరెస్ – బీజేపీ ల జిమ్మిక్కు పాలిటిక్స్ ఉన్నాయా..? వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేయనుండటంతో అదే స్థానం నుంచి కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ గా కొనసాగుతున్న గాలి అనిల్ కుమార్ ను కటకటాల్లోకి నెట్టాలని రాజకీయ వ్యూహముందా..? ఢిల్లీ లిక్కర్ స్కాంను తెరమరుగుచేసేందుకే ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ నేతలపైకి ఈడీని బీజేపీ ఉసిగోల్పిందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
నేషనల్ హెరాల్డ్ కు విరాళాలు ఇచ్చారని గాలి అనిల్ కుమార్ కు తాజాగా ఈడీ నోటిసులు ఇష్యూ చేసింది. అక్టోబర్ 12న ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నోటిసుల్లో పేర్కొంది. అయితే, ఈడీ నోటిసులు జారీ చేయడం వెనక కేసీఆర్ చక్రం తిప్పారనే ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ తో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తోన్న కేసీఆర్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్ కుమార్ మరోసారి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆయన గ్రాఫ్ నానాటికీ పెరుగుతుండటంతో కేసీఆర్ కు ముందే ఓటమి భయం పట్టుకుందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. గాలి అనిల్ కుమార్ కు ఈడీ నోటిసుల జారీ వెనక కేసీఆర్ ద్విముఖ రాజకీయ వ్యూహం ఉందన్న విశ్లేషణలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
మెదక్ పార్లమెంట్ పరిధిలో గాలి అనిల్ కుమార్ హవాను తగ్గించడం ఒకటైతే… ఢిల్లీ లిక్కర్ స్కాం అంశాన్ని పక్కదోవ పట్టించవచ్చుననే వ్యూహంలోనే భాగంగానే బీజేపీ – టీఆరెస్ లు ఈడీ అధికారులతో నోటిసులు జారీ చేయించారన్న వాదనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గాలి అనిల్ కుమార్ పై ఎలాంటి అవినీతి మచ్చ లేకపోవడంతో కేసీఆర్ ఈ విధమైన ప్లాన్ చేసి ఉంటారని అంటున్నారు. అయితే , నోటిసులపై స్పందించిన గాలి అనిల్ కుమార్ ఈడీ ఎదుట విచారణకు హాజరు అవుతానని..తన సచ్చీలతను నిరూపించుకుంటానని ప్రకటించారు.