తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు లేనంతగా హీటెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్ లో కొనసాగుతుండగా…ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాము ముందస్తుకు సిద్దంగా ఉన్నామని, విపక్షాలు తేదీని ఖరారు చేయాలనీ సవాల్ విసిరారు. ఇందుకు బీజేపీ, కాంగ్రెస్ లు కూడా స్పందించాయి. నాలుగు రోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చేసి రా.. తేల్చుకుందాం నువ్వా- నేనో అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్రతి సవాల్ విసిరారు. బండి సంజయ్ కూడా ముందస్తుకు తామెప్పుడో ప్రిపేర్ అయి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ముందస్తు అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళే సమయంలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రజల అటెన్షన్ తన వైపు మళ్లించుకున్నా కేసీఆర్.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని నేరుగా ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. వరుణ దేవుడు కరుణించిన తరువాత కేసీఆర్ జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనుండటం ఆసక్తికరంగా మారింది. పీకే సర్వేలో టీఆర్ఎస్ కు నిరాశాజనకమైన ఫలితాలు వస్తుండటంతో ఇక లాభం లేదనుకొని స్వయంగా తనే రంగంలోకి దిగాలని నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి పది జిల్లాలను కేసీఆర్ చుట్టేస్తూ సీఎంవో వర్గాలు ఆల్రెడీ రూట్ మ్యాప్ ఖరారు కూడా ఖరారు చేశాయని సమాచారం. ఈ క్రమంలోనే ముసురుకు ముగింపు పడగానే ముందస్తు వ్యూహంలో భాగంగా కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తారని తెలుస్తోంది.
మరోవైపు.. ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ డైలమాలో పడినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ బొటాబోటీ మెజార్టీతో మాత్రం అధికారంలోకి వస్తుందని పీకే సర్వేలో తేలడంతో…అతి విశ్వాసంతో ఎన్నికలకు వెళ్తే బొక్కాబోర్లా పడతామని కేసీఆర్ ఆందోళనగా టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలా కాదని షెడ్యూల్ మేరకు ఎన్నికలకు వెళ్తే బీజేపీ, కాంగ్రెస్ లు మరింత పటిష్టం అవుతే అసలుకే ఎసరు వస్తుందని కేసీఆర్ లో కలవరం మొదలైందని ప్రచారం జరుగుతోంది. అందుకే , ఎమ్మెల్యేలను జనాల్లోనే ఉండాలని ఆదేశిస్తూ.. తను కూడా ప్రగతి భవన్ కు గుడ్ బై చెప్పేసి ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని తలుస్తున్నారని సమాచారం.
జిల్లాల పర్యటనల తరువాత జాతీయ పార్టీపై కూడా కేసీఆర్ కీలక ప్రకటన ఉండనుందని సమాచారం.