చాలామటుకు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం కామన్ గా జరుగుతుంటుంది కాని, టీఆర్ఎస్ రెండో దఫా పాలనలో జరిగిన ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీకి భంగపాటు తప్పలేదు. గ్రేటర్ హైదరాబాద్ తోపాటు దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీచాయి. దీంతో కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని అంత అనుకున్నారు. సంక్షేమ పథకాలతో ప్రజల మెప్పు పొందినా.. ప్రత్యర్ధి పార్టీల నాయకత్వంతో టీఆర్ఎస్ కు మరోసారి అధికారంపై బెంగ మొదలైంది. ఈ సమయంలోనే వచ్చిన మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో టీఆర్ఎస్ లో కొత్త చర్చ జరుగుతోంది. ఇదే ఊపులో ముందస్తుకు వెళ్తే మూడోసారి విజయం దక్కడం ఖాయమని..ఆలస్యం చేస్తే ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ , బీజేపీలు క్యాష్ చేసుకోనున్నాయనే ఆలోచనతో టీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. ముందస్తును కేసీఆర్ కొట్టిపారేస్తున్నా ..మునుగోడు ఉప ఎన్నిక ఫలితం, జాతీయ రాజకీయాల దృష్ట్యా ముందస్తుకు కేసీఆర్ కూడా మొగ్గే అవకాశం ఉంది. తెలంగాణలో ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. ఇప్పుడు ముందస్తుకు వెళ్లి విజయం సాధిస్తే ముచ్చటగా మూడోసారి టీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన వారౌతారు కేసీఆర్. జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తోన్న కేసీఆర్ ఈ విజయంతో 2024లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై దేశ వ్యాప్తంగా అంచనాలను క్రియేట్ చేయొచ్చు.
ముందస్తులో నెగ్గితే తెలంగాణ మోడల్ అనే నినాదానికి మరింత ప్రాధాన్యత లభించి, పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ప్రభావం కనబరచవచ్చునని టీఆర్ఎస్ కీలక నేతల్లో అంతర్గత చర్చ జరుగుతోంది. మరి కేసీఆర్ మనస్సులో ఏముందో..!