నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రేసులో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి నేత , టీపీసీసీ నాయకులు డాక్టర్ రవి నాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విద్యార్ధి యువ నాయకుడు కావడం, పార్టీ కోసం కమిట్మెంట్ తో పని చేస్తుండటంతోపాటు నిత్యం ప్రజల్లోనే ఉండటం రవి నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంటారన్న ప్రచారానికి ఊతమిస్తోంది. ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన ఈ నియోజకవర్గం సీపీఐతోపాటు కాంగ్రెస్ కు కంచుకోటగా నిలుస్తు వస్తోంది.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ – సీపీఐ పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన రమావత్ రవీంద్ర కుమార్ ఆ తరువాత అధికార పార్టీలోకి జంప్ చేశారు. తిరిగి 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆరెస్ అభ్యర్థిగా పోటీ చేసి బాలు నాయక్ పై విజయం సాధించారు రవీంద్ర కుమార్. అప్పటి నుంచి అధికార టీఆరెస్ వైఫల్యాలపై ప్రశ్నించే నేతగా రవి నాయక్ అందరికీ నోళ్ళలో నానుతూ వస్తున్నాడు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ నేనున్నాననే భరోసా కల్పిస్తూ కాంగ్రెస్ క్యాడర్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రేసులో రవి నాయక్ పేరు నానుతోంది.
ఈసారి ఓయూ విద్యార్ధి నేతల్లో కనీసం ముగ్గురికి అయిన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ చెప్పినట్లుగా తెలుస్తోంది. 2018ముందస్తు ఎన్నికల సమయంలోనే ముగ్గురికి అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ ఆదేశించిన కొన్ని కారణాల వలన అది సాధ్యపడలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లోనైనా ఓయూ విద్యార్ధి నేతలకు కాంగ్రెస్ తరుఫున టికెట్లు కేటాయించి ఓయూ విద్యార్ధి నేతలను కాంగ్రెస్ కేవలం రాజకీయ ఎదుగుదలకు మాత్రమే వాడుకుంటుందన్న విమర్శలను తుడిచి చేయాలని రాహుల్ గాంధీ ఆదేశించినట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2023లో జరిగే ఎన్నికల్లో దేవరకొండ నియోజకవర్గం నుంచి రవి నాయక్ కు ఓయూ విద్యార్ధి నేత కోటాలో టికెట్ దక్కే అవకాశాలు కూడా లేకపోలేదనే చర్చ నడుస్తోంది.
ప్రస్తుత ఎమ్మెల్యే వరుసగా రెండు సార్లు గెలుపొందటంతో ఆయనపై ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉండటం…స్థానికంగా ఎమ్మెల్యే ఉండకపోవడం, ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు పెరిగిపోవడంతో ఈసారి దేవరకొండలో కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయంగా కనిపిస్తోంది. రవి నాయక్ నియోజకవర్గ పర్యటన సమయంలో ఎమ్మెల్యే వైఫల్యాలను ఆయన దృష్టికి తీసుకొస్తూ రవి నాయక్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. విద్యావంతుడు, ప్రజా సమస్యలపై అవగాహన , కొట్లాడే తత్త్వం కల్గిన డాక్టర్ రవి నాయక్ లాంటి రాజకీయ నాయకులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటూ ఆశీర్వదిస్తున్నారు.
బుధవారం డిండి మండలం కుదేల్ భాయ్ తండాలో పర్యటించిన ఆయనకు తండావాసులు ఘన స్వాగతం పలికి సమస్యలను వివరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. తండాలో ఒక్కరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది లేదని… టీఆరెస్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేస్తోందని రవి నాయక్ మండిపడ్డారు. వారం రోజుల్లో గిరిజన రిజర్వేషన్లకు సంబంధించిన జీవోను జారీ చేస్తానన్న ముఖ్యమంత్రిని దేవరకొండ ఎమ్మెల్యే నిలదీయాలని డిమాండ్ చేశారు.